ఈ ప్రశ్న పురాణకాలం నుంచీ అడుగుతున్నదైనా ఈనాటికీ సమాధానం మాత్రం దొరకలేదు. రోజులు మారాయి ఆడవాళ్ళు ఏదైనా చేయగలరని అనుకుంటున్న ఈ రోజుల్లో నిప్పుల కొలిమిలో నిలువునా కాలిపోతున్న మహిళలు ఇంకా ఎందరో వున్నారు. ఉదాహరణ నా స్నేహితురాలి కధే. నా చిన్ననాటి స్నేహితురాలి జీవితం పెళ్ళి అయిన మూడునాళ్ళకే కన్నీళ్ళ పర్యంతం అయింది. తన పెళ్ళి అయిన నెల లోపే నేను విన్న మొదటి వార్త తను భర్తని వదిలి వచ్చేసిందని. నేను షాక్ తో తనకి ఫోన్ చేసినపుడు తన భర్త ప్రవర్తన నచ్చకే వచ్చేసాననీ ఇంకేమీ అడగద్దనీ అనటంతో నేను మరేమీ మాట్లాడలేకపోయాను. కొద్ది రోజుల గడువు తరువాత నేను మరొకసారి తనతో మట్లాడటానికి ప్రయత్నిస్తే నా స్నేహితురాలి అమ్మగారు ఫోన్ తీసారు. నేను నా స్నేహితురాలి గురించి వాకబు చేయగానే, ఆవిడ తన కూతురుకు తనకు ఏ సంబంధం లేదనీ, భర్తను వదిలి వచ్చిన దానితో ఎవరూ మాట్లాడమనీ చెప్పి ఒకటే చీవాట్లు నా స్నేహితురాలిని. ఆఖరికి వాకబు చేయగా తను వేరే వూరిలో వుండి చదువుకుంటోందని తెలిసింది. పోనీలే మనసు మరొకదానిపైన మళ్ళించి మంచిపని చేసిందని అనుకున్నా, “ఇంత తొందరపాటు పని ఎందుకు చేసింది? కొద్ది రోజులు భర్త ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసి ఉండచ్చు కదా!” అని నా మనసులో అనుకోకుండా ఉండలేకపోయాను. అలా ఒక సంవత్సరం గడిచింది. నేను వీలు దొరికినపుడల్లా నా స్నేహితురాలి యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నాను. తను చదువును కొనసాగిస్తూ, కాలాన్ని వృధా చేయకుండా ఎవరి అండ దండా లేకుండా గడుపుతుంటే తన గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కానీ మనం సంఘం మధ్య, కట్టుబాట్ల సంకెళ్ళ మధ్య ఉన్నామని, అవి మన బతుకు మనల్ని బతకనివ్వవని ఆ క్షణం మరిచాను.
ఒక రోజు నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తను తన భర్త దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్పింది. రేపో మాపో విడాకులు తీసుకోవాలనుకుంటున్న తనలో ఈ మార్పు ఏమిటని అశ్చర్యం వేసింది. తన నిర్ణయం వెనుక తన తల్లితండ్రుల ఒత్తిడి చాలా వుందని, వారు తన వల్ల బయట ఎవరికీ మొహం చూపించలేకపోతున్నారనీ పైగా వారి అండ లేకుండా తను ఎన్నాళ్ళు ఒంటరిగా ఉండగలననీ అంది. తన భర్త కూడా తన రాకకు సరే అన్నాడనీ అంటే పోనీలే అంతా తన మంచికే జరిగిందని అనుకున్నా. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి సుఖంగా ఉందని అనుకుంటున్న సమయం లో మరొకసారి తనకి ఫోన్ చేస్తే, తన కొత్త జీవితం ఎలా ఉందని అడిగితే, ఆమె సమాధానం ‘నరకం’ లా ఉందని. తన భర్త ఏ మాత్రం మారలేదనీ, అతనికి లేని దురలవాటు లేదనీ, శారీరకంగా మానసికంగా హింసననుభవిస్తున్నాననీ అంటే గుండె తరుక్కుపోయింది. ఆమెని తిరిగి కాపురానికి రమ్మన్నది కట్నం వెనక్కి ఇవ్వాల్సి వస్తుందన్న కారణం చేతనేననీ అన్నది. పోనీ ఈ నరకం నుంచి వెళ్ళిపోదామంటె తన తల్లితండ్రులు ఛస్తామని బెదిరించటం వల్ల వేరే దారి తనకు లేదని అంటే నా చిన్ననాటి స్నేహితురాలి కోసం ఏమీ చేయలేని అశక్తురాలినై పోయాను. ఆమె తల్లి తో మాట్లడితే ప్రయోజనం ఉంటుందనుకుంటే, కూతురు ఏమైపొయినా ఫరవాలేదు కానీ తనకి పరువే ముఖ్యం అనే ఆమె సమాధానానికి ఆమెని నిందించాలో లేక ఆమెనలా మార్చిన లోకాన్ని నిందించాలో తెలీక మరోసారి అశక్తురాలినైపోయాను. ఉన్నత చదువు చదివీ తన బతుకు తను బతకలేక, భర్త కాళ్ళ కింద పడుండమని తల్లే చెప్తుంటే మౌనంగా రోదిస్తున్న నా స్నేహితురాలి జీవితం ప్రతి క్షణం కళ్ళ ముందు మెదులుతుంటే, కట్టుబాట్లని, సంఘాన్ని అసహ్యించుకోవటం తప్ప మరేమి చేయగలను. ఎంతమంది వీరేశలింగాలు పుట్టినా, ఎంతమంది గాంధీలు పుట్టినా, మారని సంఘం, లోకులు, ’స్త్రీ కి స్త్రీ యే శత్రువు’ అనే మాటని నిజం చేస్తున్న తోటి స్త్రీ లు ఉన్నంతవరకూ స్త్రీ స్వాతంత్ర్యం మాత్రం కలలో మాటే.
ఇది చిన్న సమస్యేమీ కాదు. ఎన్నెన్నో కనిపెట్టే మనము, ఇలాంటి మొండిఘటాల మనస్సులను మార్చే సాధనం ఒక్కటీ కనుక్కోలేమా? అందరు బయటపడరు కానీ భారతదేశంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. భర్తను విడవలేరు, అలాగని కలసి కాపురం చెయ్యనూ లేరు. నాకు ఇది జీవితకాలపు ర్యాగింగేమో అనిపిస్తుంది. లేకుంటే ఎందుకీ ఖర్మ. లోపం ఎక్కడ ఉంది? సమాధానం మీకేమైనా తెలుసా?
“స్వాతంత్ర్యం”
దేనికి స్వాతంత్ర్యం ? ఎందులో స్వాతంత్ర్యం ? దేనిలో లోపించింది స్వాతంత్ర్యం ? మగవాడికి ఉందా స్వాతంత్ర్యం ? ఒకవేళ లేదనుకుంటే, దానికెవరు కారణం ? ఇది రామాయణ కాలం నాటి ప్రశ్న అని మీకెవరు చెప్పారు ?
సృష్టిలో అన్నీ కొద్దిపాటి ఎంపికలే, స్వాతంత్ర్యాలు లేవు. దేవుడు ఏ జీవికీ ఇవ్వలేదు.
స్త్రీ స్వాతంత్ర్యానికి కులం,గోత్రం,చదువు,డబ్బు లాంటి తేడాల్లేవండీ. మా చుట్టాల్లోనే ఓ వెధవుండే వాడు. కాకపోతే మన సమాజమే ఒక పెద్ద వింత. స్త్రీలను ఆకాశానికి పుస్తకాల్లో ఎత్తేస్తాము, నిజ జీవితంలో పడేస్తాం!
ఇలాంటివి విన్నప్పుడు బ్రహ్మానందం గాడి “మన్మధుడు” లో డైలాగు ఒకటి గుర్తుకొస్తుంది. “ఇండియాని 50 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఫలానా దేశం అవుతుందని” అంటాడు. 50 ఏం ఖర్మ, 100 కూడా వేసుకొవచ్చు ఇలాంటి విషయాల్లో మనం ఎంత వెనకపడి ఉన్నామో చెప్పటానికి.
వసుంధర గారు,
మరో మాట! మీరు అక్షరాల్లో తప్పుల్లేకుండా బ్లాగుతున్నారు. అందుకు కృతజ్ఞతలు.
స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. అదున్నప్పుడు తల్లి బెదిరింపులకీ, భర్త వేధింపులకీ భయపడక్కర లేదు. ఇక సంఘమా, అది డబ్బున్న వాడి/దాని చేతిలో కీలుబొమ్మ. నాకు పరువే ముఖ్యం నా కూతురు జీవితం ఏమైపోయినా అనే తల్లితో ఇంకా మాట్లాడేదేముంది? ఆమె ఒక్కరోజు ఛస్తుందని (అసలు ఇలా బెదిరించేవారు ఖచ్చితంగా చావరు) కూతురు రోజూ చావాలా?
కొంత మంది అజ్ఞానంతో స్త్రీని హింసిస్తారు. వాళ్ళను మార్చవచ్చు. కొందరు జ్ఞానంతో ఆ పని చేస్తారు వాళ్ళను మార్చలేము. ఈ ఒక్కగానొక్క జీవితాన్ని అలాంటి మూర్ఖుడి చేతికింద వెళ్ళబుచ్చే కంటే వేశ్యగానైనా స్వేచ్చగా బ్రతకడమే మంచిదంటాను నేను. ఇదేమాట నేను నా చెల్లికైనా, కూతురికైనా చెప్పగలను.
–ప్రసాద్
http://blog.charasala.com
hold your head high, walk out and live life on your terms.
(wo) men are not disturbed because of things that happen but because of their opinion of things that happen
నవీన్ గారు,
మీరు అడిగేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ర్యాగింగ్ ఎవరు ఎవరిని చేస్తున్నట్లు అనిపిస్తోంది అన్నది నాకు అర్థం కాలేదు.
వ్యసన పరులను మార్చడం చాల కష్టం అండి. 20/20 hindsight లో ఇలా చేసుంటే? అని అనిపిస్తుంటుంది కాని, చెయ్య గలిగి ఉంటే చేస్తాము తప్పని సరిగా. కుటుంబం మొత్తం కలిసి సమస్యను (వ్యసనం, భార్యను వేధించడం వంటి వాటిని) పరిష్కరించడం కోసం చూడాలి. భార్యకి సమస్యను వదిలేసి, నువ్వు పరిష్కరించుకోలేక పోతున్నావు అనే విషయం కాదు. చాలా కోణాలు ఉంటాయి ఇటువంటి సమస్యలకు. చూసే వారికి సలహాలు చెప్పడం తేలిక. కలిసి సమస్యను పరిష్కరించడానికి, ముందు కుటుంబం సమస్యను గుర్తించడం అవసరం. చాలా సార్లు ఆ అమ్మాయిని సమస్యగా చూస్తారు, సమస్యని కాకుండా.
మీకు ఏమి చెయ్యొచ్చు అనిపిస్తోందో తెలియ చేయండి. ఆలోచిద్దాం.
బాలసుబ్రహ్మణ్యం గారూ, స్వాతంత్ర్యం కావల్సింది స్వేఛ్ఛగా బతకటానికి. మగవాడికి స్వాతంత్ర్యం కొన్ని సార్లు లేకపోవచ్చు కానీ ఇదే పరిస్థితి అతనికి వస్తే అతను బయటకి వచ్చేసినా సంఘం స్త్రీ ని సాధించినట్లుగా అతనిని సాధించదు. అతని బతుకు అతను బతికే వీలు వుంది. అలాంటి ఉదాహరణలు ఎన్నో నేను చూసాను. ఇకపోతే, ఈ ప్రశ్న పురాణకాలానిది అని ఎందుకన్నానంటే రామాయణం లో రాసినవన్నీ నిజాలో కల్పనలో తెలీదు కానీ సీతని రాముడు అనుమానించాడని రాయటం వల్ల మగవారి మనసుల్లో స్త్రీని అనుమనించే కొత్త బీజం నాటుకుంది. మరీ లోతుగా వెళ్ళేంత ఓపిక లేదు కానీ మనుధర్మ శాస్త్రాలూ మొదలైనవి స్త్రీ ని అణిగిమణిగి ఉండమని రాసాయి. మరి ఆనాటి నుంచీ వస్తున్న సమస్య కాదంటారా ఇది? మరోమాట సృష్టిలో దేవుడు ఇతరుల స్వాతంత్ర్యాన్ని లాక్కునే అధికారం మాత్రం ఎవరికీ ఇవ్వలేదని చెప్పగలను.
అక్షరాలలో తప్పుల్లేకుండా బ్లాగటం కొంచెం కష్టంగానే ఉందండీ, అందులోనూ నేను కొత్తగా బ్లాగుతున్నా కదా అలవాటు కాలేదు ఇంకా. కష్టమైనా మొత్తానికి మీ వంటి వారి వద్ద మన్ననలు అందుకున్నందుకు సంతోషం గా ఉంది.
కొద్దిగా సమాజం మారుతుందనిపిస్తుంది.కూతురికి కట్టబెట్టినవాడు వెధవని ,వేధిస్తున్నాడని తెలిసాకా ఈ మధ్య తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు.వెంటనే వెళ్ళి కూతురిని తీసుకొచ్చేస్తున్నారు.కానీ శాశ్వత పరిష్కారం ఆలోచించకుండా కొన్నాళ్ళు ఆగి సర్దుబాట్లు చేసి,అబ్బాయిని మందలించి మళ్ళా కూతురిని అక్కడికే పంపుతున్నారు. ఇంతకు ముందు ఇలా లేదు.ఎన్ని బాధలయినా భర్త దగ్గరే.ఈ మాత్రం మార్పుకే ఎన్నో యుగాలు పడితే అసలు మార్పుకి ఇంకెన్ని యుగాలు పడుతుందో. సమాజం లో మార్పుకి తగ్గట్టు అందరూ మారుతున్నారు ఒక్క పురుషుడు తప్ప.చదువు పెరుగుతున్నా సంస్కారం పెంచుకోని మగవాళ్ళని చాలా మందినే చూస్తున్నాం ఈ కాలం లో.
లలితగారు, ఇది వరకే చెప్పినట్లు నేను జెనరలైజేషనుకు బద్ద వ్యతిరేకిని. దంపతుల్లో ఒకరు మనస్సును అర్థం చేసుకోలేని మూర్ఖులు, మొండిఘటాలైతే వేరొకరికి జీవితాంతం ర్యాగింగే కదండి? కాకుంటే భారతదేశంలో ఇలాంటి మొండిఘటాలు ఎక్కువ భర్తలే ఉంటారు. చెప్పడానికి బాధేస్తోంది కానీ, వీళ్ళకు ఆడవాళ్ళంటే జీతం లేని పని మనుష్యులు, చెప్పిన మాటకల్లా తలూపే గంగిరెద్దులు. ఆ కాలం తల్లులు ఇట్టాంటి నిరంకుశత్వాన్ని ఎలా భరించారో పాపం. ఒక విధంగా వీరందరూ అమాయకులేమో అనిపిస్తుంది. సమస్యను ఆదిలోనే పరిష్కరించే తెలివి అందరికీ ఉంటే బాగుంటుంది. అంటే కీలెరిగి వాత పెట్టడం అన్న మాట. రాక్షసుల విషయంలో ఏ వాతలు పని చెయ్యవు
ఏ వాత పని చేస్తుందో మీకేమైనా తెలుసా? (మళ్ళీ బంతిని మీ కోర్టులోకే నెట్టానా..)
ఇలాంటి సమస్యలే కాక, స్త్రీ జీవితానికి వచ్చే కష్టాలకు కారణం సంఘం మాత్రమే అనుకోవడం నా ఉద్దేశ్యం లో పూర్త్తిగా సబబు కాదనిపిస్తుంది. సంఘం అలా అంటుంది, సహకరించదు అని భయపడడం మొదట తల్లితండ్రులు మానాలి. సంఘం ఒకవేళ దూషిస్తుందని అనిపిస్తే, సంఘానికి సరైన సమాధానం చెప్పగలగాలి. సొంత కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం అని గట్టిగా అనుకోవాలి. సంఘం లో దూషించే వాళ్ళు కూడా తల్లితండ్రులే అని గమనించాలి. జీవితాంతం నరకం అనుభవించే కన్నా విడిపోవడం తప్పు కాదని తెలుసుకోవాలి. ఇదే ఒక వేళ వారికి జరిగి ఉంటే ఇలాగే నరకం అనుభవించే వారా ? కష్టాలలో సానుభూతి తప్ప ఏమి సాయం చేయలేని స్వార్ఠపు సంఘం కోసం మన జీవితాలు ఎందుకు నాశనమవ్వాలి ? సంఘం ఎమన్నా ఫరవాలేదు, నా బిడ్డ జీవితం ముఖ్యమనుకుని ముందుకెళ్ళిన తల్లితండ్రులను నేను చూశాను కూడా.వారిని సంఘం ఏమీ చేయలేదు. ఏదో చేస్తుందని కేవలం భయం మాత్రమే.
రామాయణం వల్ల జనం ఆడవాళ్ళని అనుమానించడం మొదలుపెట్టారా ? నిజంగా ఇదో కొత్త ప్రతిపాదన. వివాహవ్యవస్థ మొదలయ్యాకే అనుమానించడాలు కూడా మొదలయ్యాయని నేననుకుంటూ వచ్చాను. నా అభిప్రాయంలో తప్పుంటే సవరించుకుంటాను.
సమానత్వం, స్వేచ్ఛ – చాలా పెద్ద మాటలు. ఎవరూ వీటిని సంతృప్తికరంగా వివరించలేకపోయారు. వివరించబోయి పప్పులో కాలేసినవాళ్ళే ఎక్కువ. ఇవి బహిరంగ వేదికల మీద చెల్లు, వ్యక్తిగతాల్లో నిల్లు అన్నట్లే ఉన్నాయి. కానీ నేను అర్థం చేసుకున్నది ఒకటుంది. ఒక జంటగా చూసినప్పుడు స్త్రీ, పురుషుడూ ఒకటి కాదు. కాకపోవడం వల్లనే ఒకరితో ఒకరికి అవసరం ఏర్పడింది. పరస్పర అవసరం ఉంది కనుకనే కలిసి ఉంటారు. పురుషుడి ఆధిక్యమే స్త్రీపురుష సంబంధంలో ఉన్న ఆకర్షణ. అది తొలగించాక ఆ సంబంధమే రద్దవుతుంది.
అయినా ఈరోజు ప్రపంచాన్ని ఆడ, మగ అని విభజించే పరిస్థితి ఉందా ? ఉన్న వాళ్ళూ లేనివాళ్ళూ అని విభజించే పరిస్థితి మాత్రమే ఉంది. ఉన్న స్త్రీ పేదపురుషుడి శ్రమశక్తిని దోచుకోగలదు. ఉన్న స్త్రీ హార్వర్డ్‌లో చదవగలదు. పేద పురుషుడు అయిదో తరగతి పాసవ్వడమే అనుమానాస్పదం. కలిగిన స్త్రీ ఎన్ని స్త్రీవాదాలైనా మాట్లాడగలదు. ఆమె తలచుకుంటే మొగుడికి విడాకులూ ఇవ్వగలదు. కేసులూ పెట్టగలదు. వీలయితే చంపించగలదు కూడా ! పేద స్త్రీకి తన కుటుంబమే తన ధనం, తన ఆస్తి, తన సర్వస్వమూను. ఆమె అలాంటివాటికి సాహసించజాలదు. ధనిక స్త్రీ స్త్రీల యొక్క అన్ని సాంప్రదాయిక పనుల్నీ ఇతర స్త్రీ కార్మికురాళ్ళకు వదిలిపెట్టి పిల్లల పెంపకం వగైరా స్త్రీల బాధ్యత కాదని ఉపన్యాసాలివ్వగలదు. ఈ దర్జా అందరు స్త్రీలకూ సాధ్యమయ్యే రోజు వస్తుందంటారా ? ఒకవేళ వస్తుందనుకుంటే అది స్త్రీల కన్నా మగవాళ్ళకే ముందు వస్తుంది.
కలిగిన స్త్రీ అంటే ఆమె భర్త సంపాదన వల్ల ఆమె కలిగిన స్త్రీ అయిందా లేక ఆమే కలిగిన స్త్రీనా అనే విషయాన్ని బట్టి ఉంటుంది ఆమె తీరు. అయినా నేను చూసినంతవరకూ భార్యా భర్తల మధ్య పేదవారిలోనే ఎక్కువ స్వేఛ్చ ఉంటుంది. భర్త సాధిస్తే అతన్ని వదిలేసి పాచిపని చేసుకుని బతకగలదు. నలుగురూ ఏమనుకుంటారో అన్న భయం ఆమె కి ఉండదు ఎందుకంటే అలా ఆలోచిస్తే వారి బ్రతుకులు వెళ్ళవు గనుక. స్త్రీలపై అధికారం చూపించటం లాంటి దరిద్రాలన్నీ మధ్య తరగతి కుటుంబాలలోనే ఎక్కువ. మింగలేక కక్కలేక బ్రతుకు వెళ్ళదీసేవారెందరో. స్త్రీ అంటే మంచిది అని అర్ధమని నేను అనలేదు. అన్ని రకాల వాళ్ళూ ఉన్నారు వారిలో. అయినా ఒక్కొక్కరి దృక్పధం ఒక్కోలా ఉంటుంది. చిన్నప్పటి నుంచీ నేను చూసిన, విన్న సంఘటనలన్నీ స్త్రీల మీద జులుం చెలాయించినవే. అందువల్లనే నా వాదన స్త్రీ వాదన అయింది కానీ ఇదేదో పాపులర్ వాదన అని మాత్రం రాయలేదు.
ఆర్థిక స్వాతంత్ర్యంతో అన్నీ వచ్చేస్తాయా ? మగవాడికి అలా వచ్చేశాయా ? లేదా స్త్రీలకు అనుకూలంగా చట్టాలు చేస్తే స్త్రీపురుష సంబంధాల తత్వం విప్లవాత్మకంగా మారిపోతుందా ?
ఈ ఆర్థిక స్వాతంత్ర్యం ప్రాథమికంగా ఎవరి చేతుల్లోంచి ప్రభవిస్తుంది ? బాగా డబ్బున్న మగ పెట్టుబడిదార్ల నుంచి. ఇంట్లో ఒక మగవాణ్ణి భరించలేకపోతే బయట అలాంటివాళ్ళు ఒక వందమందిని భరించాల్సి వస్తుంది. వీణ్ణి చూసి వణక్కపోయినా వాళ్ళని చూసి వణకాల్సి వస్తుంది. ఆడవాళ్ళు డబ్బు సంపాదించాక మళ్ళీ దాని నిర్వహణ కోసం ఒకరో ఇద్దరో మగవాళ్ళు అవసరమౌతారు.
స్త్రీలకు అనుకూలమైన చట్టాల్ని అంతిమంగా ఎవరు అమలు జరపాలి ? మళ్ళీ మగవాళ్ళే. వాటి మూలంగా తమ ఉమ్మడి ప్రయోజనాలకు భంగమని వాళ్ళు అనుకున్నప్పుడు అవి ఉద్దేశపూర్వకంగా తూట్లుపొడవబడతాయి. వాటికి పోటీగా కొత్త చట్టాలు వేరే వేరే ముసుగుల్లో తేబడతాయి. ఇప్పుడు అన్ని రకాల ఆస్తిబదలాయింపు చట్టాల్ని (Tarnsfer of property acts) రద్దుచెయ్యాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నవాళ్ళున్నారు. అప్పుడు స్వార్జితం మీద తప్ప ఇక దేనిమీదా ఎవరికీ హక్కు ఉండకూడదనే పరిస్థితి వస్తుంది. ఆ స్వార్జితం ఎక్కువ సందర్భాల్లో మగవాడికే సొంతం.
ఏం చెయ్యాలి ?
చట్టాలూ డబ్బూ కొత్త సమస్యల్ని తెచ్చిపెడతాయి. అన్ని సమస్యల్నీ పరిష్కరించగలిగినది సంస్కృతి మాత్రమే. మన జీవిత విధానాన్ని పాశ్చాత్యపద్ధతిలో పాశ్చాత్యుల సిద్ధాంతాలకు అనుగుణంగా నడుపుకుంటున్నప్పుడు తన్మూలంగా ఉప్పతిల్లే సమస్యలకు సైతం పాశ్చాత్య పరిష్కారాలే అవసరమౌతాయి.అవి స్త్రీపురుషుల మధ్య ఇంకా ఇంకా అగాధాల్నే సృష్టించడానికి ప్రయత్నిస్తాయి.మనం మన సంస్కృతిని నమ్మి ఆచరించినప్పుడు పరిష్కారాలు కూడా ఇందులోనే దొరుకుతాయి. మన సంస్కృతిని మనం నమ్మకపోవడం ఆచరించకపోవడం అన్ని అనర్థాలకూ మూలం. ఈ దేశంలో ఆడపిల్లను లక్ష్మీదేవిగా చూసుకునే సంప్రదాయం ఉండేది. గృహణిని గృహలక్ష్మిగా ఇంటికి దీపంగా భావించే సంస్కృతి ఉండేది. భర్తను దేవుడుగా భావించే సంస్కారం ఉండేది. ఇవన్నీ వదిలిపెట్టాక ఇంకేం మిగిలింది ? ఏ చట్టాలు ఏ ఉద్యోగాలు ఈ అపురూప భావనల స్థానాన్ని భర్తీ చెయ్యగలవు ?దీన్ని ఎదిరించడం అనాలోచితం.
Vasundhara garu,
Try to educate your friend’s mother first and then give necessary support to your friend. Ask her not to lose courage. KashTalu vachinappuDe manaloni goppatanam bayaTiki vastundi. Meanwhile you can try to discuss thisissue with women rights protection cells. elanTI goDava or issue kaakunDa samarasyam ga dinni parishkarinchune margalu villu emanna suchinchachchu. IlanTi samayam lo oka friend ga mii mide ekkuva responsibility vunTundi. (manninchanDi ila anTunnnanduku) Gather all your friends. andaru samishTiga samasya ni parishkarinchanDi. Saantiyuta maargalu ennno vunnayi.
1) Your friends mom can some few mediators(madhyavartulu) and try to resolve the issue through open discussions. These sort of things make the husband and in-laws family afraid a bit about society.
2) Your friends parents can convince their son-in-law to get a psychological counseling to get rid of bad habits or can make him admitt in any de-addiction centres.
3) Atleast you, your friends and parents of the victim can pressurise in-laws to allow your friend to work. So that your friend can get deviation and can get the maturity and necessary financial support to handle things.
Bahusa ilanTi alochanalu miru munde chesi vunTaru.. Kani keep working on it. Antaki minchi ekkuva cheppalenu. ekkuva chorava chesku cheppinaTTu vunTe, pardon me.
అరుణ గారు,
చాలా ఓపిగ్గా మీరు రాసిన వ్యాఖ్యకు ముందుగా నా ధన్యవాదములు. మీరు చెప్పిన ప్రతి సలహా నాకు నచ్చింది. మీరన్నట్లు ఇందులో కొన్ని ఆలోచనలు నాకు కూడా వచ్చాయి. కానీ ఏదైనా చేయటానికి ముందు నా స్నేహితురాలి సహకారం ఉండాలి కదా. తను ఏదైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటే ఫరవాలేదు. ఒకసారి బయటకు వచ్చేసిన తను ఇప్పుడు మళ్ళీ భర్త దగ్గరకి వెళ్ళింది. ఇప్పుడు ఏమి చేయాలో తను నిర్ణయించుకోవాలే కానీ తనకి బయటకు వచ్చేయమనే సలహా ఇవ్వలేను నేను. ఒకవేళ తను ఎవరినైనా ఎదిరించటానికి సిద్ధంగా ఉంటే తనకి నా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తాను. ప్రస్తుతం తన తల్లి తో మరొకసారి మాట్లాడటం తప్పిస్తే మరేమీ చెయ్యలేను. కానీ తరచుగా నా స్నేహితురాలి పరిస్థితి తెలుసుకుంటూనే వున్నాను. మోరల్ సపోర్ట్ కూడా ముఖ్యం కదా. తను ఏదైనా వుద్యోగం లో చేరటానికి ప్రయత్నిస్తోంది. చూద్దాం పరిస్థితులు చక్కబడతాయేమో అనే ఆశ ఎక్కడో ఉంది.