Feeds:
టపాలు
వ్యాఖ్యలు

నీ స్మృతిలో …

నీ గురించి రాయాలని వేల సార్లనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. నీ ప్రేమని తల్చుకొని తట్టుకొనే శక్తి నాకు లేదనిపించింది. నీ జ్ఞాపకాలతో వచ్చే ఉద్వేగాన్ని భరించలేనేమోననిపించింది. కానీ నీ గురించి, నువ్వు నా మీద చూపించిన ప్రేమ గురించి రాస్తే నా మనసుకు కొంతైనా సాంత్వన కలుగుతుందేమోననే ఆశ..!!! అందుకే రాయాలని నిశ్చయించాను.

కాలం అన్నింటినీ మర్చిపోయేలా చేయగలదంటారు. కానీ 15 సం||లు కావస్తున్నా ఏ కాలమూ, ఏ సంవత్సరమూ, ఏ సంతోషమూ నిన్ను మర్చిపోయేలా చేయలేకపోయింది. నీ వయసు వాళ్ళనెవరిని చూసినా, నిన్ను పోలిన వారెవరిని చూసినా, నీలా హుషారుగా మాట్లాడేవారెవరిని చూసినా నువ్వు గుర్తొస్తావు. నా కోసం నువ్వు పడే తాపత్రయం గుర్తొస్తుంది. రాత్రి టీవీ చూస్తుంటే నాకు మైసూరుపాకు తినాలని ఉందని మాటవరసకంటే నువ్వు ఏదో పనుందని వంటింట్లోకెళ్ళి కాసేపట్లోనే ఘుమఘుమలాడే మైసూరుపాకు తెచ్చిన సంఘటన గుర్తొస్తుంది. చీటికీమాటికీ నాకు ఒంట్లో బాగోకపోతే నాకోసం నువ్వు పడిన బాధ నాకు గుర్తొస్తుంది. నా నొప్పి నీకొచ్చినా బావుండును అని ఎన్ని సార్లు అనేదానివో నాకు గుర్తుంది. ఊరంతా సైకిలు మీద తిరిగి ఇంటికొచ్చి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే ఒక పక్క విసుక్కుంటూనే మరో పక్క నా కాళ్ళకి కొబ్బరినూనె రాసి వేడి నీళ్ళతో కడిగి నన్ను సేద తీర్చేదానివి. అన్ని అదృష్టాలకీ, అంత ప్రేమకీ నోచుకున్నందుకు నా జన్మ ధన్యమైందని సంతోషించాలో, లేక అవన్నీ అంత తొందరగా చిన్నప్పుడే నాకు దూరమైనందుకు బాధపడాలో అర్థంకాదు..

నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కడో వైద్యం కోసం నాకూ నాన్నగారికీ దూరంగా ఉన్నప్పుడు నువ్వు రాసిన ఉత్తరం, అందులో నీ ఆవేదన, ఆ ఉత్తరం చూసినప్పుడల్లా కంటతడి పెట్టిస్తుంది. వైద్యం చేయించుకోకపోయినా పర్వాలేదు, బతికి ఉన్న నాలుగు రోజులూ నాతోనూ నాన్నగారితోనూ ఉండాలన్న నీ కోరిక చూసి భగవంతుడు ఎంత చెడ్డవాడో అని అప్పట్లో అనుకోని రోజు లేదు. అంత బరువుని, బాధని నువ్వెలా మోసావో .. అదంతా చూసిన నేనెలా భరించానో.. ఇప్పటికీ అర్థం కాదు. ఈ రోజు నేను నిన్ను తల్చుకోవడం తప్పిస్తే ఏం చేయగలను..? కనీసం నీ అంత ప్రేమ రేపు నా పిల్లల మీద నేను చూపించగలిగితే నిన్ను సంతృప్తిపరచినట్లే..!! అసలు నేను రేపు నాలాంటి మరొకరికి జన్మనిస్తున్నానంటే నువ్వెంత సంతోషించేదానివో కదా ..? కానీ నీకీ విషయం ఎలా తెలుస్తుంది..?

       వీకెండొస్తోందంటే చాలు శుక్రవారం నుంచే నేను ప్లాన్లు మొదలుపెడతాను. శుక్రవారం సాయంత్రాన్ని నాకెపుడూ వృధా చేయాలనిపించదు పైగా అది ఎంతో విలువైనది కూడానూ. ఎందుకంటే తరువాత వచ్చే శనివారం సాయంత్రమేమో ఇంకేముంది ఇంక వున్నది ఆదివారమొక్కరోజేగా అని బెంగ తో గడపాల్సివస్తుంది. ఆదివారం గురించి చెప్పనే అక్కర్లేదు మర్నాడొచ్చే సోమవారం నుంచీ పొలోమని తను ఆఫీసుకు నేను కాలేజీకు పోవాలి. అందుకే శుక్రవారం మాత్రం ఏ చీకూ, చింతా లేకుండా గడపాలని ఉంటుంది నాకు. అయితే అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే  నాకీ బ్లాగు బ్లాగే అవసరమే రాకపోదును. సరిగ్గా శుక్రవారం నాడు మధ్యాన్నానికల్లా నా ప్లాన్ల జాబితా సిద్ధం చేసుకున్నాక మా వారికి ఫోన్ చేస్తాను కదా అదేంటో గానీ ఆయన మాట్లాడేలోపే అటువైపు నుంచి సమాధానం నాకు తెలిసిపోతుంది. అది నాకేదో ఇష్యూ వచ్చింది కాస్త ఆలస్యమవ్వచ్చని . ఆఫీసులో మొదలైన ఆ ఇష్యూ.. ఇష్యూ మా ఇంట్లో పెద్ద ఇష్యూ జరిగేదాక సా..గుతుంది. ఎందుకంటే నా ప్లాన్ల జాబితా అమలుకాబోదు కనుక. ఆ తర్వాత ఆలస్యంగా ఆయన ఇల్లు చేరాక ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేస్తానా..వద్దనుకుంటూనే మొదలుపెడతాను నా నిరసన. దానివల్ల మిగతా సమయం అంతా చీకూ, చింతా లేకుండా గడపటానికి బదులు చికాకులు, చింతలతో వెళ్ళబుచ్చుతాము. అంతటితో నా కలల శుక్రవారం కలతలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వలనేమో!  నేను శుక్రవారం జాబితా తయారుచేసేలోపే మా వారి మేనేజరు అంతకంటే పెద్ద జాబితా తయారు చేస్తాడు. పోనిలే అనుకుంటే అదేదో మరో రోజు మరో రోజూ కాదాయె..సరిగ్గా శుక్రవారమే.

       ఇదిలా ఉండగా మేముండేది కాలిఫోర్నియా కావటం వల్ల రాజమండ్రీలో కంటే ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయి. శుక్రవారం నాడు తను ఎంత ఆలస్యంగా వచ్చినా ఆ రోజు రాత్రి వేసే పదకొండింటి ఆటకు సినిమాకు వెళ్ళటానికి ఏ ఆటంకమూ రాదని అప్పటికప్పుడు మరో పధకం అమలుచేస్తాను. అందులోను తెలుగు సినిమాకి వాళ్ళ మేనేజరు ఖచ్చితంగా రాడని నా ధీమా. ముఖ్యంగా సాఫ్టువేరింజనీర్ల భార్యల ప్రధమ శత్రువైన లాప్ టాపు సినిమాకు రాలేదు. సరిగ్గా అక్కడే నా ప్లాన్లో చిన్న బగ్గు. దాని పేరు “క్రికెట్.” కాలిఫోర్నియాలో యెండలు మండినా, చలి వణికించినా ప్రతి శనివారం తను ఆరుగంటలకు లేచి వెళ్ళి మరీ ఆడే క్రికెట్ కోసం మా శుక్రవారం రాత్రి సినిమా వాయిదా పడుతుంది. ఒకవేళ తను సినిమాకి వెళ్దామన్నా రాత్రి రెండింటికి సినిమా అయ్యాక ఇంక మర్నాడు లేచి క్రికెట్ ఆడలేరని నేనే వద్దంటాను. అప్పుడుకూడా బాక్ గ్రౌండులో “నీకోసం ఒక్కరోజు క్రికెట్ కూడా నేను మానలేనా..?”లాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి కానీ అవి నా వూహల బాక్ గ్రౌండుకు మాత్రమే పరిమితమైపోతాయి. మరో ఇష్యూ మొదలుపెట్టే వోపిక లేక ఇంక ఒక నిర్ణయానికి వచ్చేస్తాను. “శుక్రవారం నాది కాదు!” అని. ఇంత జరిగినా షార్టు టెర్ము మెమొరీ వచ్చినట్లుగా మరుసటి శుక్రవారం మధ్యాన్నానికి నా ప్లాను సిద్ధం. అమలంటారా..? గ్రహాల అనుకూలత మీద ఆధారపడిఉంటుంది.

ఆశ

జాజి తీగ చిగురులో..
వాన చినుకు రాకలో..
లేగదూడ పరుగులో..
అమ్మ జోలపాటలో..
నాలో..ఆశ..గుప్పెడంత ఆశ

మా సోనా..!!

నాకు పెళ్ళయిన వెంటనే బెంగుళూరుకు వచ్చేసాను. వచ్చిన వారం లోపే అనుకుంటాను ఒకరోజు ఏమీ తోచక బయట బాల్కనీ లో నిల్చున్నాను. ఆ ఇంట్లో మేము పైన అద్దెకుండేవాళ్ళం కింద ఇల్లుగలవాళ్ళు ఉండేవాళ్ళు. చుట్టూ చూస్తుంటే ఇంచుమించు మా డాబా కి ఆనుకుందా అన్నంత దగ్గర్లో ఉన్న పక్క మేడ మీద గోధుమ రంగులో ఉన్న ఒక కుక్క నా వైపే చూస్తూ తోకాడిస్తోంది(నేనెవరో తెలీకపోయినా). దాన్ని చూడగానే ముద్దొచ్చి లోపలికెళ్ళి దానికి తినటానికి ఒక బిస్కట్టు తెచ్చి పక్క డాబా మీదకు విసిరాను. అది ఆవురావురుమని తినేసింది. ఇంకాకొన్ని  విసురుదామంటే ఎవరైనా చూస్తే బాగోదని అనిపించి “ఇలా ఇటురా ఇంకా పెడతాను” అని అంటూ సైగ చేసాను. అలా అన్నానే కానీ నా మొహం దానికేం అర్థమవుతుంది, పైగా తెలుగులో అన్నాను అదేమో కన్నడ కుక్కాయె అని లోపలికెళ్ళాను. అంతలోనే “కుయ్ కుయ్” మని వినిపిస్తే బయటకెళ్ళి చూద్దును కదా! పక్క డాబా గోధుమరంగు కుక్క నా ముందుంది. ఒక్కసారి ఆశ్చర్యపోయినా అంతలోనే తేరుకుని దానికి మిగతా బిస్కట్టులు పెట్టి అబ్బో ఇది చాలా తెలివైన కుక్క లా ఉందని అనుకున్నాను. అప్పటినుండీ ఇంక అది నన్ను వదిలిపెడితే ఒట్టు. పక్క డాబా మీది దాని మకాం మా డాబా మీదకి మార్చేసింది. తోకవూపుతూ అది చూపించే ప్రేమకి నేను కూడా కరిగిపోయాను. నేనెందుకో దానికి బాగా నచ్చుంటానని తెగ సంబరపడిపోయాను కూడా.  వెర్రిదాన్ని! నాకేంతెలుసు అది ఎవర్ని చూసినా అలాగే తోకూపుతుందని. సాయంత్రం మా ఆయన రాగానే దాన్ని చూపించాను కదా! పొద్దున్న చూపించిన ఆప్యాయతంతా అది తన దగ్గర చూపించేసింది.  అమ్మో గడుసుదే ఇది అనుకుని ఆ రోజునుంచీ దానికి ఫుల్ మీల్స్ ఇవ్వడమే కాక దానికి “సోనా” అని నామకరణం కూడా చేసేసాను దాని గోధుమ రంగు చూసి.
     ఒకరోజు పొద్దున్నే మా ఇంటి ఓనరు పైకొచ్చి మా తలుపు దబ దబా బాదాడు.  ఏంటా అని చూస్తే మా వారినీ నన్నూ బయటకి రమ్మని చెప్పి “ఇదుగో చూడండి మీరు చేరదీసిన కుక్క ఏంపని చేసిందో” అని ఆయనకొచ్చీరాని తెలుగులో చెప్తున్నాడు. ఆయనకంతకోపమొచ్చేంత పనేంచేసిందా అని చూస్తే అక్కడ ఒక చిరిగిపోయిన ప్లాస్టీక్ సంచీ దాని చుట్టూ ఎముకలూ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.  అది చూసాక నిద్రమత్తు వదిలిపోయింది దెబ్బకి. ఏ పెంటకుప్ప మీంచో ఆ ప్లాస్టీకు సంచీడు ఎముకలు తెచ్చి మా డాబా మీద పెట్టుకుని హాయిగా తిన్నన్ని తిని పారేసినన్ని పారేసిందన్నమాట.  అవన్నీ తీసి శుభ్రం చేయమని నిర్మొహమాటంగా మాకు చెప్పి మా ఓనరు వెళ్ళిపోయాడు. మా ఖర్మ కొద్దీ ఆ రోజు మా పనిమనిషి రాకపోవటం వల్ల ఆ పనంతా నేనూ మా ఆయనా కలిసి ముక్కుమూసుకుని చేసాం. ఇంత జరిగినా సోనా మీద కోపం రాలేదు నాకు పోన్లే పాపం ఆకలేస్తే అదేం చేస్తుందనుకుని ఊరుకున్నాను.  పైగా దాని ఫుల్ మీల్స్ కేమాత్రం ఢోకా రానివ్వలేదు కూడా. ఏ రోజైనా ఇంట్లో వంట చేయనపుడు బయట తింటే దానికి పార్సిలు కూడా తెచ్చేవాళ్ళం. ఇంతపెట్టినా అది ప్లాస్టీకు సంచీలతో ఎముకలు వగైరా తెస్తూ మా చేత తుడిపిస్తూనే ఉంది. అదేంటో ఆ రోజే విచిత్రంగా మా పనమ్మాయి మానేసేది. మా కర్మ పరిపక్వత చెందటం వల్ల  కాబోలు. 
     సోనా కాక మాకు ఇంట్లో పమేరియన్ కుక్క ఉండేది. దాని పేరు ప్రిన్సెస్.  ఒకరోజు ప్రిన్సెస్ ని వాకింగ్ కి తీసుకెళ్ళినపుడు ప్రిన్సెస్ మీదకి ఒక వీధికుక్క వచ్చింది. ఖంగార్లో ఏం చేయాలో పాలుపోలేదు నాకు. ఇంతలో ఎక్కడినుంచొచ్చిందో మరి, సోనా వచ్చి ఆ కుక్క ని తరిమి కొట్టి దాని ధైర్య సాహసాల్ని చాటుకుంది. అప్పటినుంచీ సాధారణంగా మనుషులు గానీ, జంతువులుగానీ ఎవరూ ఒక పట్టాన నచ్చని మా ప్రిన్సెస్ కి ఈ సోనా నచ్చేసింది. మేము వాకింగ్ కి వెళ్ళినపుడల్లా వెనుక సోనా మా బోడీగార్డయిపోయింది.

    ఎవరెంత చెప్పినా మేము సోనాని చేరదీయటం మాత్రం మానలేదు. అది చూపించే అతి ప్రేమకి మేము మురిసిపోయేవాళ్ళం. ఇబ్బందల్లా దాని అతి చేష్టలే. పక్కనే నిల్చుంటే దాని తోక చాలా బలంగా వూపేది అప్పుడు ఠపీ ఠపీమని తగిలేది దానితోక. మమ్మల్ని రాసుకుని పూసుకుంటే గానీ దానికి హాయిగా ఉండేది కాదు. మేడమీదారేసిన బట్టలమీద హాయిగా పడుకునేది. రాత్రుళ్ళు వీధికుక్కలతో పోట్లాడుతూ మమ్మల్ని నిద్రపోనిచ్చేదికాదు. ఇవన్నీ ఇలా మేము భరిస్తుండగా ఒకరోజు మా అత్తగారూ మావగారూ వాళ్ళూ మాతో కొన్నిరోజులు గడపటానికి ఆంధ్రా నుంచి వచ్చారు. ఇంటినిండా సందడి చూసి మా ప్రిన్సెస్ కేమో విసుగూ మా సోనాకేమో సంతోషం వేసేసాయి. ఒకరోజు పొద్దున్నే మా మావగారు బాల్కనీలో కూర్చుని గడ్డం చేసుకుంటున్నారు. అంతలోనే ఆయన పిలుపు/అరుపు వినిపిస్తే వెళ్ళి చూస్తే సోనా ఆయన ఒళ్ళో కూర్చునుంది.  చూడమ్మా, ఈ కుక్క వెళ్ళమన్నా వెళ్ళట్లేదు నా వొళ్ళో కూర్చుంటానంటోందని ఆయనంటే నాకు నవ్వాగలేదు. నవ్వితే బాగోదని ఎలాగోఅలా దాన్ని బతిమాలి పంపించేసాను.  అలా వాళ్ళున్నన్నాళ్ళూ దాని వన్నెలూ, చిన్నెలూ చూపించేసింది సోనా. వెళ్ళేటప్పుడు మా మావగారు నన్ను పిలిచి ” చూడమ్మా ఆ కుక్క కి కాస్త చనువెక్కువిచ్చినట్లున్నావు ” అని చెప్పి మరీ వెళ్ళారు. అలా సోనా చేసిన చిలిపి పనులూ వాటికి సర్దిచెప్పలేక మేము పడిన పాట్లూ చాలా జరిగాయి. అయినా కూడా సోనా ఇంకా దగ్గరైపోయింది. దాని కళ్ళలో చాలా ఆప్యాయత ఉంటుందని మా వారు అంటారు. అంతలోనే మేము అమెరికాకి వెళ్ళాలని తెలియడంతో సోనాని విడిచి వెళ్ళటానికి చాలా బాధేసింది. ప్రిన్సెస్ అప్పటికే చనిపోయింది జబ్బు చేసి.  ఉన్న ఒక్కదాన్నీ  వదిలి రాలేకపోయాను.  కానీ తప్పలేదు. ఇండియా లోనే వేరే ఏ స్టేట్ కైనా అయితే సోనాని తీసుకెళ్ళిపోయేదాన్నే. మా వీధిలో సోనాని మాలా చేరదీసే వాళ్ళున్నారు. వాళ్ళకి బాగా చూసుకోమని అప్పగింతలు చెప్పి కన్నీళ్ళతో దానికి వీడ్కోలు పలికాను. అమెరికా వచ్చిన కొన్ని రోజుల తర్వాత మా ఇంటి ఓనరు భార్యకి సోనా గురించి ఫోన్ చేసాను. చాలా రోజులు ఇక్కడే ఉంది కానీ ఈ మధ్యే అదెక్కడికో వెళ్ళి మళ్ళీ రాలేదని ఆవిడ చెప్పారు. నాకు దుఃఖం ఆగలేదు. ఎలా ఉందో ఏం చేస్తోందో వెర్రిది పాపం! అని దాన్ని తల్చుకోని రోజు లేదు ఇప్పటికీ.

లోకం లో నేను

లోకం చూస్తుండగా నవ్వను నేను
చూస్తే ఓర్వలేదని
లోకానికి తెలీకుండా ఏడుస్తాను నేను
తెలిస్తే పండుగ చేసుకుంటుందని
అసూయాద్వేషాలకు
అక్క చెల్లెళ్ళూ, ఆప్తమిత్రులూ
అతీతులు కారన్న నిజాన్ని చెప్పిన లోకం లో
ఏకాకిగానైనా బ్రతుకుతాను కానీ
మరో కాకినై దానితో ఏకీభవించను.

నేనూ, సుజాతా!

“సుజ్జుబేటీ, ఏం చేస్తున్నావే!” అని పిలవగానే కాలేజీ ఉందన్న ఖంగారు ఏ మాత్రం లేకుండా నిదానంగా పుస్తకాలు పట్టుకుని బయటకు వచ్చేది సుజాత. అక్కడి నుంచి కబుర్లు చెప్పుకుంటూ అరమైలు దూరం లో ఉన్న బస్టాండు దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రాజమండ్రీ బస్సెక్కి కాలేజీకెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఈసురో గోడో మంటూ ఇంటికొచ్చేదాకా నాతోపాటుగా సుజాతే ఉండేది. నేను ఇంటరు ఫస్టు ఇయరు లో చేరటానికి వెళ్తున్నప్పుడు సుజాత నాకు మొట్టమొదటి సారిగా పరిచయం. అప్పుడు మా అమ్మా, నేనూ బస్సు లో రాజమండ్రీ కాలేజీకి ఇంటరు అప్ప్లికేషను పెట్టటానికి వెళ్తున్నాం. అదే బస్సులో ఉన్న సుజాత కూడా నేను చేరబోతున్న కాలేజీలోనే చేరుతోందని తెలిసి మా అమ్మ మొహం లో బెంగ అంతా పోయి ఒక్కసారిగా కళ వచ్చేసింది. “రోజూ ఇద్దరూ కలిసి వెళ్ళండమ్మా” అని మా అమ్మ నాకూ సుజాతకూ జత కట్టేసింది. “అలాగేనండీ, మీరేమీ ఖంగారుపడకండి నేనుంటానుగా.” అని ముదిపేరక్క లాగా ధైర్యం చెప్పింది మా అమ్మకి. అది మొదలు సుజాతకీ నాకూ పరిచయం, స్నేహం. ఇంటరు అంతా కలిసేవున్నా ఎందుకో ఇంటరు సెకండు ఇయరు ఆఖరికి వచ్చాకగానీ సుజాతా నేనూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వలేదు. ఆ తర్వాత డిగ్రీ రాజమండ్రీ ఉమెన్సు కాలేజీలో బీకాంలో కలిసి చేరాం.

     సుజాతని నేను ముద్దుగా “సుజ్జుబేటీ” అని పిలిచేదాన్ని. అలా ఎందుకు పిలిచేదాన్నో తెలీదు కానీ ఆ పిలుపులో ఎంతో ప్రేమ, ఆప్యాయత కలబోసి పిలిచేదాన్ని. అదంటే నాకంత ఇష్టం మరి. అసలు మా ఇంటిపక్కనే ఉన్న రేవులో బస్సులాగేవి. అయినా సుజాత తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళటం కోసం అరమైలు దూరం దానింటిదాకా నడిచి అక్కడి నుంచి మరో అరమైలు దూరం లో వున్న పెద్ద బస్టాండుకెళ్ళి అక్కడ బస్సెక్కేదాన్ని. సుజాత కాలేజీకి వెళ్ళకపోతే నేనూ వెళ్ళేదాన్ని కాదు. అలాగే నేను మానేసిన రోజున అదీ మానేసేది. మా ఇద్దర్నీ చూసి మా ఇంగ్లీషు టీచరికి వొళ్ళు మండిపోయేది. ఇద్దరూ వస్తే వస్తారు లేకపోతే ఇద్దరూ మానేస్తారా అని ఆవిడకి కోపం. పైగా మేము మెరుపు మెరిసినట్లు అప్పుడప్పుడూ మాత్రం మెరుస్తామని ఎగతాళి చేసేది. ఆవిడన్నమాటా నిజమేలెండి! అస్తమానూ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకెళ్ళిపోయేవాళ్ళం సుజాతా, నేనూ. మేము మోర్నింగు షో సినిమా ప్రోగ్రాము పెట్టుకున్న రోజు, రోజూ కంటే త్వరగా సుజాతింటికెళ్ళి “సుజ్జుబేటీ రావే కాలేజీకి టైమైపోతోంది” అనగానే సుజాత కంటే రెండేళ్ళు చిన్నవాడైన సుజాత తమ్ముడు తాపీగా వచ్చి “ఏం సినిమాకీ” అనేవాడు. “సినిమా ఏంటి” అని నేను అమాయకంగా అంటే, “ఛా మీరెప్పుడైనా కాలేజీ టైమైపోతోందని ఖంగారుపడ్డారా” అని సెటైరు వేసేవాడు. రోజూ లా నిదానంగా కాకుండా ఆదరాబాదరాగా వచ్చిన సుజాత “సర్లే బాగానే కనిపెట్టావు గానీ  ఇంట్లో వాగావంటే అయిపోతావు” అని వాడికి వార్నింగు ఇచ్చి మరీ వచ్చేది.  ఎంత కాలేజీ ఎగ్గొట్టినా ఒక్కరోజు కూడా మా అకౌంట్స్ ట్యూషను మాత్రం మానేవాళ్ళం కాదు. కాలేజీలో ఏవీ చెప్పేడవరు కనుక ట్యూషన్ మీదే డిపెండు అయ్యేవాళ్ళం. పరీక్షలు దగ్గరకి వస్తున్నప్పుడు కంబైండు స్టడీ చేసి రాత్రీ పగలూ చదివేసి ఎలాగోలా మార్కులు తెచ్చేసుకునేవాళ్ళం.

     అసలు సుజాతే లేకపోతే నా కాలేజీ రోజులు నిస్సారంగా ఉండేవేమో!  అది రానపుడు కాలేజీకెళ్తే నాకు ఏమీ తోచేది కాదు. మా క్లాసులో అందరూ మార్కుల వారీగా, కులాల వారీగా స్నేహం చేసేవారు. అలా తయారైన గ్రూపుల్లో నేను ఇమడలేకపోయేదాన్ని. ఇక బస్సులో ఎవరైనా పోకిరీ వెధవలు ఏడిపిస్తారేమోనని మరో బెంగ. సుజాత నా పక్కనుంటే నాకు ఎనలేని ధైర్యం వచ్చేసేది. పైగా అలాంటివాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో దానికి బాగా తెలుసు.  డిగ్రీ రెండేళ్ళూ అదీ నేనూ చూడని సినిమా లేదు, లంచ్ టైములో తినని చిరుతిండి లేదు. బొప్పాయిముక్కలూ, పుచ్చకాయిముక్కలూ, జామకాయిలూ, దిల్ పసందులూ, వేరుసెనక్కాయిలూ లాంటివి తింటూ చెప్పుకోని కబుర్లు లేవు, వేసుకోని జోకుల్లేవు. అలా సరదాగా మా స్నేహం సాగిపోతుండగా డిగ్రీ సెకండియర్లో ఒకరోజు సుజాత నాతో చెప్పింది తనకు పెళ్ళికుదిరిందని.  పైగా తను అక్కడితో చదువు ఆపేస్తున్నానని కూడా చెప్పింది.  అది సంతోషకరమైన వార్త అయినా నేను మాత్రం ఎక్కెక్కి ఏడ్చాను. నాతోపాటుగా ఎప్పుడూ ఉంటూ నన్ను నవ్వించే సుజాత,  ఇంటరులో మా అమ్మ పోయినప్పుడు నన్ను ఓదార్చి నా వెంటే వున్న సుజాత ఇక నాతో ఉండబోదని తెలిసిన ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. తన పెళ్ళయ్యాక కూడా మన స్నేహం ఇలాగే కొనసాగుతుందని మాటిచ్చిన సుజాత పెళ్ళి తర్వాత సంసారంలో పడిపోయింది. తర్వత నేనూ పెళ్ళిచేసుకుని అమెరికాకి వచ్చేసాను. మేమెంత దూరంలో ఉన్నా నా మనసులో సుజాత మాత్రం అలానే ఉండిపోయింది. ఆ మధ్య ఇండియా వెళ్ళినపుడు ఒకటి రెండు సార్లు తనని కలవాలని వాళ్ళింటికెళ్తే తను వాళ్ళ అత్తగారి వూర్లో ఉందని చెప్పారు. ఈసారి ఇండియా వెళ్తే తప్పకుండా సుజాతని కలవాలి. కలిసి ఎన్నో కబుర్లు చెప్పాలి. ఆ మధ్య రాజమండ్రీ బస్టాండులో అప్పట్లో మేము వేరుసెనగక్కాయలు క్రమం తప్పకుండా కొనే వెరుసెనక్కాయలతను కనిపించి “మీతోపాటుండే ఆ పాపగారేరండీ” అని అడిగాడు ఆ విషయం కూడా సుజాతకి చెప్పాలి.

నేను యెనిమిదో తొమ్మిదో చదువుతున్నాననుకుంట అప్పుడు. మా ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగారు ఒక కుటుంబం.  పురుషోత్తమ శర్మ గారని, పెద్ద కుటుంబమే వాళ్ళది.  ఆయన, ఆయన భార్య, ముగ్గురు ఆడ పిల్లలు సత్య, శుభ, పవన ఇంకా ఈ పిల్లల బామ్మ గారు వెరసి మొత్తం ఆరుగురు.  పిల్లలు ముగ్గుర్లో సత్య, పవనా కొంచెం అటూ ఇటూగా నా ఈడు వాళ్ళే. శుభ కొంచెం పెద్దది. నాకైతే వీళ్ళందర్నీ చూడగానే భలే సంతోషం వేసింది. ఎంచక్కా రోజూ ఆడుకోవచ్చునని. అయితే వాళ్ళని పరిచయం చేసుకుందామని మా మేడమెట్ల వైపున్న వాళ్ళ వాటా వైపు వెళ్ళానా అక్కడ ఆ ముగ్గురూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంటి వోనరు అమ్మాయి వచ్చిందని కూడా పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏమిటా అని అక్కడే నిల్చుని వింటుంటే ఒక్క ముక్కా అర్థం కావట్లేదు. వినటానికి తెలుగు లానే ఉంది కానీ ఏదో తేడాగా ఉంది ఆ భాష. ఎంతసేపటికీ వాళ్ళు నన్ను పట్టించుకోకపోతే చూద్దాం వీళ్ళ టెక్కు ఏంటో అని నేనే వెళ్ళి నన్ను నేను పరిచయం చేసేసుకున్నా. వాళ్ళని కూడా వాళ్ళు పరిచయం చేసుకున్నాక మళ్ళా నా ముందే మొదలెట్టారు ఆ వింత భాష. అమ్మో వీళ్ళకేవో భాషలు వచ్చల్లే వుందని ఇంక స్టైలు కొట్టటం ఆపి ప్లీజ్, ప్లీజ్ నాకూ నేర్పరూ ఈ భాష! ఈ రోజు నుంచీ మనమంతా ఫ్రెండ్స్ అన్నా. సరేనని వాళ్ళు ముగ్గురూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని మళ్ళీ ఆ వింత భాషలో ఏవో గొణుక్కుని ఆఖరికి సరేనన్నారు. ఇంతాచేసి ఆ వింత భాష ఏంటా అని అడిగితే అది తిరగేసి భాష అట. వాక్యం లోని ప్రతి పదాన్నీ తిరగేసి మాట్లాడుతూ వాక్యం పూర్తి చేస్తారన్నమాట. అప్పటిదాకా క భాష జ భాష మాత్రమే విన్నాన్నేను. వినటమే కాదు అనర్గళంగా మాట్లాడగలను కూడా. నాకు రాని ఈ తిరగేసి భాషని ఎలాగైనా నేర్చుకుని తీరాలని అప్పటికప్పుడే తీర్మానించేసుకున్నా. వినటానికి సులువు గానే వున్నా మాట్లాడటానికి మాత్రం చాలా ప్రాక్టీసు కావాలనిపించింది.  పైగా వీళ్ళైతే చాలా మామూలుగా మాట్లాడినట్లు తడబడకుండా మాట్లాడేస్తున్నారు. వీళ్ళు నేర్పినా అంత బాగా నేనెప్పటికి మాట్లాడుతానో అని అప్పుడే బెంగొచ్చేసింది నాకు.  అయినా సరే పట్టువదలని ఝాన్సీ రాణీలా నాకు నేనే శపధం చేసుకున్నా ఈ భాష అంతేమిటో చూద్దామని.  అప్పటినుండి మొదలు ప్రతిరోజూ వాళ్ళ దగ్గర నేర్చుకోవటం ఇంట్లో మళ్ళీ ప్రాక్టీసు చేయటం. స్కూల్లో సమయం దొరికినా నాలో నేను లోపల మనసులో ఆ భాషలో మాట్లాడుకుంటూ, టచ్ పోకుండా రోజూ సాయంత్రాలు నా ముగ్గురు స్నేహితులతో ఈ భాషలోనే ముచ్చటిస్తూ, సందేహాలుంటే తీర్చుకుంటూ బాగా సాధన చేసాను. మొత్తానికి మట్లాడడమైతే వచ్చేసింది కానీ వాళ్ళు మాట్లాడుతుంటే విని అనువదించుకుని అర్థం చేసుకోవటానికి కొంచెం సమయం పట్టింది. ఎలాగైతేనేం అది కూడా వచ్చేసాక ఏదో ప్రపంచాన్ని జయించినంత సంతోషం వేసేసింది.  ఇంక అది మొదలు మేము నలుగురము బజారుకు వెళ్ళినా, షికారుకు వెళ్ళినా ఈ తిరగేసి భాషలో అందరి ముందూ గొప్పగా మాట్లాడేసుకుంటూ, అదేంటో అర్థం కాని వాళ్ళ వంక కొంచెం జాలిగా, మరికొంచెం గర్వంగా చూస్తూ తెగ విర్రవీగేవాళ్ళం.  ఇదికాక ఎవరినైన వాళ్ళ ముందే ఏడిపించుకోవటానికీ, తిట్టుకోవటానికీ కూడా భలేగా పనికి వచ్చేదీభాష. అసలు మేము మామూలుగా మట్లాడటం ఎలాగో మర్చిపోయాం ఈ భాష వచ్చాక. నేను వాళ్ళ దగ్గరకొచ్చి, “మిఏ రున్నాస్తుచే?” అంటే వాళ్ళు మీఏ దుట్లేయచే. రుజాబ కు మాళ్దావె? అనేవారు. ఇలా కనపడిన వాళ్ళ ముందూ, కనపడని వాళ్ళ ముందూ ఈ భాష లో వాగుతుండటం వల్ల ఎవరో వెళ్ళి, శర్మ గారి అమ్మాయిలు ఏదో పాకీ బాష మాట్లాడుతున్నారని అందరూ అంటున్నారని చల్లగా నా స్నేహితురాళ్ళ నాన్నగారి చెవిన వేసారు. ఆ ఏదో పిల్లలు లెద్దూ అని మొదట్లో ఏమీ అనలేదు మా వాళ్ళు.

     బయట ఇంత వాగినా ఇంట్లో వాగేవాళ్ళం కాదు తిడతారని. అయినా పొరపాటున ఇంట్లోవాళ్ళ మధ్య అప్పుడప్పుడూ వచ్చేస్తూ వుండేది ఈ భాష. అలా పొరపాటున ఎవరైనా వాగితే నవ్వుకోలేక చచ్చేవాళ్ళం. ఇలా మా వెకిలి నవ్వులూ, వెర్రి భాషా చూసి మా ఇంట్లోనూ నా స్నేహితురాళ్ళింట్లోనూ నిజంగానే ఇదేదో పాకీ భాష ఏమోనని అనుకుని మాకు పెద్ద వార్నింగు ఇచ్చారు. ఈ బాష మాట్లాడితే మూతి మీద వాత పెడతామని. అలాగేలెమ్మని మానేసామని చెప్పాం కానీ అలవాటుపోయేదికాదు.  అటుపై మొదలు అన్నాళ్ళూ సగర్వంగా మాట్లాడుకున్న ఈ భాషని రహస్యంగా మాట్లాడుకోవలసి వచ్చేది.  మా ఖర్మగాలి నా స్నేహితురాళ్ళ బామ్మ గారు కానీ విన్నారా ఇంక మొదలెట్టేవారు తిట్లు అవి వినలేకచచ్చేవాళ్ళం. ఆవిడకి పాపం తన, పర బేధం ఉండదు. తిట్టేటపుడు నన్ను కూడా కలిపి మరీ తిట్టేవారు. ఏమైతేనేం మరికొన్నాళ్ళు మా రహస్య భాషని కొనసాగించాము. కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు మా సాధన ముదిరి ఈ భాష లో మేము పాటలూ అవీ కూడా పాడటం మొదలెట్టాము. ఆ చెవినా ఈ చెవినా అవి విన్న మా ఇంట్లోవాళ్ళు మాకేదో గాలో, ధూళో సోకిందని భయపడటం మొదలుపెట్టారు. వాళ్ళ భయం చూసి కొంపతీసి ఏ భూతవైద్యుడి దగ్గరకో తీసుకెళ్ళి బడితపూజ చేయిస్తారేమోనని భయపడి దెబ్బకి ఈ సిగేరతి షభాని అదే తిరగేసి భాషని మట్లాడటం మనసు చంపుకుని మరీ మానేసాం. 

నిరీక్షణ

నీ కోసం వేచీ వేచీ కళ్ళు కాయలు కాసాయి
నిన్ను పంపమని వెయ్యి దేవుళ్ళకి మొక్కాను
ఎన్నిసార్లో నా కల్లోకి వస్తావు
నా కలనెపుడు నిజం చేస్తావు?
యుగాలు వీడి కల్పాలు దాటి నా సంకల్పం నెరవేర్చేందుకు వేగంగా రా

అవరోధాలెదురౌతాయని సంకోచించకు
నా ప్రేమ నీ చుట్టూ కవచమై నిన్ను నా దరికి చేరుస్తుంది
నా ప్రతిరూపం నీ రూపమయే ఆ క్షణం కోసం
అనుక్షణం పరితపిస్తూ
క్షణ క్షణం వేచి చూస్తూ
ప్రేమనంతా నీ కోసమే దాచి బరువెక్కిన హృదయంతో
నువ్వే నేను
నేనే నువ్వని
నువ్వు లేని నేనెందుకని
నా జీవితానికొక కొత్త అర్ధం నీవవ్వాలని
ఎన్ని వేల సార్లు అనుకున్నానని.

ఠాగూరు ఎవరు?

      మొన్నామధ్య మా నాన్నగారికి ఫోన్ చేసినపుడు ఆయన చెప్పిన ఒక సంగతి మొదట నాకు నవ్వుతెప్పించినా తరువాత కించిత్తు బాధ కూడా కలిగించింది. విషయం లోకి వెళ్తే మా నాన్నగారికి తరచుగా మందులూ, చిన్న చిన్న పనులూ చేసిపెట్టే తెలుసున్న అతన్ని పిలిచి “నువ్వీసారి రాజమండ్రి వెళ్తే నాకు ఠాగూరు ఫొటో ఒకటి దొరికితే తెచ్చిపెట్ట గలవా” అని అడిగారట. అతను సరే అన్నాడట. మా నాన్నగారు పెద్దవారు అవటం వల్ల బయటకి అంతగా వెళ్ళలేక ఇలా పక్కింటి వాళ్ళకెవరికైనా పని చెప్పినపుడు వాళ్ళు కాదనకుండా చేయటం పరిపాటి.  ప్రత్యేకంగా ఠాగూరు పటం ఎందుకడిగారంటే మా నాన్నగారికి ఆధ్యాత్మికతతో పాటుగా, సాహిత్యమన్నా, సంగీతమన్నా ప్రాణం. ఆయన గదిలో ఉండే వివిధ దేవుళ్ళ, దేవతల పటాలతో పాటుగా, రవీంద్రనాధ్ ఠాగూరు, మహా యోగి అరబిందో, రమణ మహర్షి, శ్యామ శాస్త్రి, త్యాగయ్య   మొదలగు వారి చిత్ర పటాలు కూడా ఉంటాయి. ఆయన వద్ద ఉన్న ఠాగూరు పటం చిరిగిపోవటంతో  పక్కింటి అతన్ని పిలిచి ఠాగూరు పటం కావాలని అడిగారన్నమాట.

      అయితే జరిగిందేమిటంటే అతను అన్నట్లుగానే ఠాగూరు పటం తెచ్చాడు కానీ అది తన సుమధుర గేయాల గానమైన గీతాంజలితో ప్రపంచాన్ని జాగృతపరచిన విశ్వకవి, నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాధ్ ఠాగూరు పటం కాదు, హింసను నమ్ముకుని అమ్ముకుంటున్న వి.వి. వినాయక్ తీసిన ఠాగూరు సినిమా లోని చిరంజీవి గారి పటం. అది చూసి మా నాన్నగారు క్షణ కాలం విస్మయానికి గురయినా తేరుకుని, తను అడిగింది ఏ ఠాగూరు పటమో అతనికి చెప్పారట. ఇది విన్న వెంటనే నాకు ఒక్కసారిగా నవ్వొచ్చినా తరువాత బాధ కలిగింది. సినిమాలు యువత పై ఇంతటి ప్రభావాన్ని చూపిస్తాయా అని. ఆ ప్రభావం ఎంతటి గాఢమైనదంటే విశ్వకవి కవిత్వం కంటే బలంగా వినాయక్ ఠాగూరు ప్రజల్లో నాటుకుందా అనేంత. కానీ అన్ని సినిమాలూ ఇలాగే ప్రభావం చూపిస్తాయంటే అదీ చెప్పలేం. చెడు, హింస ఆకట్టుకున్నంత వేగంగా సత్యాగ్రహాలూ, సందేశాలూ ఆకట్టుకోవుగా మరి.

      నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇష్టం కంటే ప్రాణం అంటే బావుంటుందేమో!  రోజూ పొద్దున్నే చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగనిదే నాకు రోజు మొదలవదు. అలానే సాయంత్రం మళ్ళీ ఇంకో కప్పు కాఫీ సేవిస్తేనే రోజు పూర్తవుతుంది. అయితే ఇది చాలా మందికి వుండే అలవాటేగా ఇందులో వింతేముంది అని మీకు సందేహం రావచ్చు. సమస్యల్లా నా ఈ అలవాటు లో ఏ మాత్రం తేడా వచ్చినా నేను సతమతమైపోతాను. సమయానికి కాఫీ నీళ్ళు గొంతులో పడకపోతే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. నా ఈ ఇష్టాన్ని చూసి చాలామంది నాకు కాఫీ పిచ్చి అనీ, నేను కెఫీను డిపెండెంటుననీ బిరుదులిచ్చేసినా సగర్వంగా స్వీకరించాను.

      అసలీ కాఫీ పైన ఇంత మక్కువ జీన్సు వల్లనే సంక్రమించిందని అనుకుంటూంటాను నేను. ఎందుకంటే, మా నాన్నగారికి కాఫీ పై మక్కువ నాకంటే ఒక రవ్వ ఎక్కువ. అందుకు ఋజువు ఎప్పుడూ ఆయన గదిలో మేకుకు వేళ్ళాడే కాఫీ ప్లాస్కే. మా అమ్మ పూజలో, పనిలో ఉన్నప్పుడు మాటిమాటికీ కాఫీ కలపమని అడిగితే విసుక్కుంటుందని ఒకేసారి ఫ్లాస్కులో పోయించేసుకుని ఆరారా సేవిస్తుంటారు మా నాన్నగారు. ఇకపోతే ఇంత చిన్నప్పుడే కాఫీ ఏంటని మా అమ్మ నా చేత కాఫీ మానిపించటానికి చేయని ప్రయత్నం లేదు. తన ప్రయత్నాలన్నీ  విఫలమవ్వటంతో ఆఖరికి నా బలహీనతను నా బలం కోసం వాడుకునే ఉపాయం కనిపెట్టింది మా అమ్మ. చిన్నప్పుడు నేను కాస్త బలహీనంగా ఉండటం చేత డాక్టరు రాసిచ్చిన ప్రొటినెక్సు (పాలల్లో కలుపుకుని తాగే పొడి) నా చేత తాగించటానికి మా అమ్మ ఒక పావు కప్పు కాఫీ ని నాకు కొ/ఎసరు గా చూపించేది. దాని కోసం నేను కళ్ళూ, ముక్కూ మూసుకుని మూడు గుక్కల్లో మందు కంపు కొట్టే ఆ ప్రొటినెక్సు పాలని మింగేసి, తరువాత మా అమ్మ చేతి కమ్మని సువాసనలు వెదజల్లే నురగల కాఫీని ఆస్వాదించేదాన్ని.  

      ఇదిలా దావనలంలా వ్యాపించి నా స్నేహితులూ, సన్నిహితులూ నేను వాళ్ళింటికి వెళ్తున్నానంటే పాపం! వారికి కాఫీ అలవాటు లేకపోయినా కాఫీపొడి కొని ఉంచటం మొదలుపెట్టారు. మా చుట్టాలిళ్ళకి వెళ్ళినపుడు మా పెద్దమ్మ లు అందరినీ అడిగినట్లే నన్ను కూడా “కాఫీ తాగుతావుటే?” అని అడిగి అంతలోనే సర్దుకుని “దీనికి కాఫీ పిచ్చి కదూ!” అని లోపలికి వెళ్ళి అందరికీ ఇచ్చే కంటే మరికాస్త ఎక్కువ పోసి పెద్ద గ్లాసుతోనే సమర్పించుకునేవారు.  కాఫీ అంటే ఎంత ఇష్టమున్నా ఏ కాఫీ పడితే ఆ కాఫీ తాగనండోయ్. కాఫీ అంటే నా నిఘంటువులో ఒకే ఒక అర్థం ఉంది. అది ఏ దేశానికి చెందినదైనా అచ్చమైన డికాక్షను కాఫీ మాత్రమేనని. బ్రూ కాఫీలూ, నెస్కెఫేలూ లాంటివి తాగి (అవంటే ఇష్టమున్న వారు మన్నించాలి) నా శరీరాన్ని, పవిత్రమైన కాఫీ పైనున్న నా ప్రేమనీ కల్మషం చేసుకోలేను.

      దిష్టేమైనా తగిలిందో ఏమో గానీ, ఇంత ఇష్టమైన ఈ కాఫీ ని కావలసినన్ని సార్లు మనశ్శాంతిగా తాగుదామంటే ఎప్పుడూ కుదరదు. ఎందుకంటే నాకెప్పుడు ఒంట్లో బాగోక డాక్టరు దగ్గరకు వెళ్ళినా అదేంటో విచిత్రం గా, “మీరు కెఫీను తగ్గించాలండీ!” అంటాడు. (వాడి కన్ను కుట్టిందో ఏమో! వాడి ముందు కాఫీ గానీ తాగానా ఏవిటి కొంపతీసి?) ఆయనలా చెప్పీ చెప్పగానే నేను ముందుగా జాగ్రత్తపడతాను. కాఫీ మానేసేననుకునేరు. ఇంకా నయం, ముందు ఈ విషయం మా వారికి తెలీకుండా జాగ్రత్తపడతాను. తెలిసిందా ఇంక అంతే సంగతులు. కాఫీ ఒక్క పూటైనా మానేయమని సతాయింపులు, సాధింపులు. అవి పడలేక ఒక్కోసారి మానేసానని అబద్ధమాడి అనఫీషియల్ గా ఏ మధ్యాహ్నం వేళో తాగేస్తుంటాను. 

      అదేవిటోగానీ, కాఫీ మానమని నన్ను పోరిన వారే గానీ కాఫీ గొప్పతనాన్ని గుర్తించిన వారు లేరు. గొప్ప గొప్ప వాళ్ళంతా కాఫీ లు తాగి బుర్ర పదును చేసుకున్నవాళ్ళే కదా. ఆ మాట కొస్తే ఈ సోదంతా రాయటానికి నాకు ఓపికనిచ్చిన టానిక్ కూడా కాఫీనే. ఆఖరుగా ఒక మాట చెప్పాలి ఎంతమంది చెప్పినా ఒక్క పూట కూడా కాఫీ మానని నేను మా అమ్మ కి బాగోనపుడు మా అమ్మ కి నయమవ్వాలని బాబా కి మొక్కుకుని నెల రోజులు కాఫీ మానేసాను. 

      ఏది ఏమైనా నా బలమూ, బలహీనతా రెండూ కాఫీనే. సర్లెండి, బ్లాగు రాయటంలో పడి మర్చేపోయాను. కాఫీ వేళ మించిపోయింది. ఈ పూట ఇంకా కాఫీ తాగనే లేదు.