Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఆగస్ట్, 2007

నేను యెనిమిదో తొమ్మిదో చదువుతున్నాననుకుంట అప్పుడు. మా ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగారు ఒక కుటుంబం.  పురుషోత్తమ శర్మ గారని, పెద్ద కుటుంబమే వాళ్ళది.  ఆయన, ఆయన భార్య, ముగ్గురు ఆడ పిల్లలు సత్య, శుభ, పవన ఇంకా ఈ పిల్లల బామ్మ గారు వెరసి మొత్తం ఆరుగురు.  పిల్లలు ముగ్గుర్లో సత్య, పవనా కొంచెం అటూ ఇటూగా నా ఈడు వాళ్ళే. శుభ కొంచెం పెద్దది. నాకైతే వీళ్ళందర్నీ చూడగానే భలే సంతోషం వేసింది. ఎంచక్కా రోజూ ఆడుకోవచ్చునని. అయితే వాళ్ళని పరిచయం చేసుకుందామని మా మేడమెట్ల వైపున్న వాళ్ళ వాటా వైపు వెళ్ళానా అక్కడ ఆ ముగ్గురూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంటి వోనరు అమ్మాయి వచ్చిందని కూడా పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏమిటా అని అక్కడే నిల్చుని వింటుంటే ఒక్క ముక్కా అర్థం కావట్లేదు. వినటానికి తెలుగు లానే ఉంది కానీ ఏదో తేడాగా ఉంది ఆ భాష. ఎంతసేపటికీ వాళ్ళు నన్ను పట్టించుకోకపోతే చూద్దాం వీళ్ళ టెక్కు ఏంటో అని నేనే వెళ్ళి నన్ను నేను పరిచయం చేసేసుకున్నా. వాళ్ళని కూడా వాళ్ళు పరిచయం చేసుకున్నాక మళ్ళా నా ముందే మొదలెట్టారు ఆ వింత భాష. అమ్మో వీళ్ళకేవో భాషలు వచ్చల్లే వుందని ఇంక స్టైలు కొట్టటం ఆపి ప్లీజ్, ప్లీజ్ నాకూ నేర్పరూ ఈ భాష! ఈ రోజు నుంచీ మనమంతా ఫ్రెండ్స్ అన్నా. సరేనని వాళ్ళు ముగ్గురూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని మళ్ళీ ఆ వింత భాషలో ఏవో గొణుక్కుని ఆఖరికి సరేనన్నారు. ఇంతాచేసి ఆ వింత భాష ఏంటా అని అడిగితే అది తిరగేసి భాష అట. వాక్యం లోని ప్రతి పదాన్నీ తిరగేసి మాట్లాడుతూ వాక్యం పూర్తి చేస్తారన్నమాట. అప్పటిదాకా క భాష జ భాష మాత్రమే విన్నాన్నేను. వినటమే కాదు అనర్గళంగా మాట్లాడగలను కూడా. నాకు రాని ఈ తిరగేసి భాషని ఎలాగైనా నేర్చుకుని తీరాలని అప్పటికప్పుడే తీర్మానించేసుకున్నా. వినటానికి సులువు గానే వున్నా మాట్లాడటానికి మాత్రం చాలా ప్రాక్టీసు కావాలనిపించింది.  పైగా వీళ్ళైతే చాలా మామూలుగా మాట్లాడినట్లు తడబడకుండా మాట్లాడేస్తున్నారు. వీళ్ళు నేర్పినా అంత బాగా నేనెప్పటికి మాట్లాడుతానో అని అప్పుడే బెంగొచ్చేసింది నాకు.  అయినా సరే పట్టువదలని ఝాన్సీ రాణీలా నాకు నేనే శపధం చేసుకున్నా ఈ భాష అంతేమిటో చూద్దామని.  అప్పటినుండి మొదలు ప్రతిరోజూ వాళ్ళ దగ్గర నేర్చుకోవటం ఇంట్లో మళ్ళీ ప్రాక్టీసు చేయటం. స్కూల్లో సమయం దొరికినా నాలో నేను లోపల మనసులో ఆ భాషలో మాట్లాడుకుంటూ, టచ్ పోకుండా రోజూ సాయంత్రాలు నా ముగ్గురు స్నేహితులతో ఈ భాషలోనే ముచ్చటిస్తూ, సందేహాలుంటే తీర్చుకుంటూ బాగా సాధన చేసాను. మొత్తానికి మట్లాడడమైతే వచ్చేసింది కానీ వాళ్ళు మాట్లాడుతుంటే విని అనువదించుకుని అర్థం చేసుకోవటానికి కొంచెం సమయం పట్టింది. ఎలాగైతేనేం అది కూడా వచ్చేసాక ఏదో ప్రపంచాన్ని జయించినంత సంతోషం వేసేసింది.  ఇంక అది మొదలు మేము నలుగురము బజారుకు వెళ్ళినా, షికారుకు వెళ్ళినా ఈ తిరగేసి భాషలో అందరి ముందూ గొప్పగా మాట్లాడేసుకుంటూ, అదేంటో అర్థం కాని వాళ్ళ వంక కొంచెం జాలిగా, మరికొంచెం గర్వంగా చూస్తూ తెగ విర్రవీగేవాళ్ళం.  ఇదికాక ఎవరినైన వాళ్ళ ముందే ఏడిపించుకోవటానికీ, తిట్టుకోవటానికీ కూడా భలేగా పనికి వచ్చేదీభాష. అసలు మేము మామూలుగా మట్లాడటం ఎలాగో మర్చిపోయాం ఈ భాష వచ్చాక. నేను వాళ్ళ దగ్గరకొచ్చి, “మిఏ రున్నాస్తుచే?” అంటే వాళ్ళు మీఏ దుట్లేయచే. రుజాబ కు మాళ్దావె? అనేవారు. ఇలా కనపడిన వాళ్ళ ముందూ, కనపడని వాళ్ళ ముందూ ఈ భాష లో వాగుతుండటం వల్ల ఎవరో వెళ్ళి, శర్మ గారి అమ్మాయిలు ఏదో పాకీ బాష మాట్లాడుతున్నారని అందరూ అంటున్నారని చల్లగా నా స్నేహితురాళ్ళ నాన్నగారి చెవిన వేసారు. ఆ ఏదో పిల్లలు లెద్దూ అని మొదట్లో ఏమీ అనలేదు మా వాళ్ళు.

     బయట ఇంత వాగినా ఇంట్లో వాగేవాళ్ళం కాదు తిడతారని. అయినా పొరపాటున ఇంట్లోవాళ్ళ మధ్య అప్పుడప్పుడూ వచ్చేస్తూ వుండేది ఈ భాష. అలా పొరపాటున ఎవరైనా వాగితే నవ్వుకోలేక చచ్చేవాళ్ళం. ఇలా మా వెకిలి నవ్వులూ, వెర్రి భాషా చూసి మా ఇంట్లోనూ నా స్నేహితురాళ్ళింట్లోనూ నిజంగానే ఇదేదో పాకీ భాష ఏమోనని అనుకుని మాకు పెద్ద వార్నింగు ఇచ్చారు. ఈ బాష మాట్లాడితే మూతి మీద వాత పెడతామని. అలాగేలెమ్మని మానేసామని చెప్పాం కానీ అలవాటుపోయేదికాదు.  అటుపై మొదలు అన్నాళ్ళూ సగర్వంగా మాట్లాడుకున్న ఈ భాషని రహస్యంగా మాట్లాడుకోవలసి వచ్చేది.  మా ఖర్మగాలి నా స్నేహితురాళ్ళ బామ్మ గారు కానీ విన్నారా ఇంక మొదలెట్టేవారు తిట్లు అవి వినలేకచచ్చేవాళ్ళం. ఆవిడకి పాపం తన, పర బేధం ఉండదు. తిట్టేటపుడు నన్ను కూడా కలిపి మరీ తిట్టేవారు. ఏమైతేనేం మరికొన్నాళ్ళు మా రహస్య భాషని కొనసాగించాము. కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు మా సాధన ముదిరి ఈ భాష లో మేము పాటలూ అవీ కూడా పాడటం మొదలెట్టాము. ఆ చెవినా ఈ చెవినా అవి విన్న మా ఇంట్లోవాళ్ళు మాకేదో గాలో, ధూళో సోకిందని భయపడటం మొదలుపెట్టారు. వాళ్ళ భయం చూసి కొంపతీసి ఏ భూతవైద్యుడి దగ్గరకో తీసుకెళ్ళి బడితపూజ చేయిస్తారేమోనని భయపడి దెబ్బకి ఈ సిగేరతి షభాని అదే తిరగేసి భాషని మట్లాడటం మనసు చంపుకుని మరీ మానేసాం. 

Read Full Post »

నీ కోసం వేచీ వేచీ కళ్ళు కాయలు కాసాయి
నిన్ను పంపమని వెయ్యి దేవుళ్ళకి మొక్కాను
ఎన్నిసార్లో నా కల్లోకి వస్తావు
నా కలనెపుడు నిజం చేస్తావు?
యుగాలు వీడి కల్పాలు దాటి నా సంకల్పం నెరవేర్చేందుకు వేగంగా రా

అవరోధాలెదురౌతాయని సంకోచించకు
నా ప్రేమ నీ చుట్టూ కవచమై నిన్ను నా దరికి చేరుస్తుంది
నా ప్రతిరూపం నీ రూపమయే ఆ క్షణం కోసం
అనుక్షణం పరితపిస్తూ
క్షణ క్షణం వేచి చూస్తూ
ప్రేమనంతా నీ కోసమే దాచి బరువెక్కిన హృదయంతో
నువ్వే నేను
నేనే నువ్వని
నువ్వు లేని నేనెందుకని
నా జీవితానికొక కొత్త అర్ధం నీవవ్వాలని
ఎన్ని వేల సార్లు అనుకున్నానని.

Read Full Post »

      మొన్నామధ్య మా నాన్నగారికి ఫోన్ చేసినపుడు ఆయన చెప్పిన ఒక సంగతి మొదట నాకు నవ్వుతెప్పించినా తరువాత కించిత్తు బాధ కూడా కలిగించింది. విషయం లోకి వెళ్తే మా నాన్నగారికి తరచుగా మందులూ, చిన్న చిన్న పనులూ చేసిపెట్టే తెలుసున్న అతన్ని పిలిచి “నువ్వీసారి రాజమండ్రి వెళ్తే నాకు ఠాగూరు ఫొటో ఒకటి దొరికితే తెచ్చిపెట్ట గలవా” అని అడిగారట. అతను సరే అన్నాడట. మా నాన్నగారు పెద్దవారు అవటం వల్ల బయటకి అంతగా వెళ్ళలేక ఇలా పక్కింటి వాళ్ళకెవరికైనా పని చెప్పినపుడు వాళ్ళు కాదనకుండా చేయటం పరిపాటి.  ప్రత్యేకంగా ఠాగూరు పటం ఎందుకడిగారంటే మా నాన్నగారికి ఆధ్యాత్మికతతో పాటుగా, సాహిత్యమన్నా, సంగీతమన్నా ప్రాణం. ఆయన గదిలో ఉండే వివిధ దేవుళ్ళ, దేవతల పటాలతో పాటుగా, రవీంద్రనాధ్ ఠాగూరు, మహా యోగి అరబిందో, రమణ మహర్షి, శ్యామ శాస్త్రి, త్యాగయ్య   మొదలగు వారి చిత్ర పటాలు కూడా ఉంటాయి. ఆయన వద్ద ఉన్న ఠాగూరు పటం చిరిగిపోవటంతో  పక్కింటి అతన్ని పిలిచి ఠాగూరు పటం కావాలని అడిగారన్నమాట.

      అయితే జరిగిందేమిటంటే అతను అన్నట్లుగానే ఠాగూరు పటం తెచ్చాడు కానీ అది తన సుమధుర గేయాల గానమైన గీతాంజలితో ప్రపంచాన్ని జాగృతపరచిన విశ్వకవి, నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాధ్ ఠాగూరు పటం కాదు, హింసను నమ్ముకుని అమ్ముకుంటున్న వి.వి. వినాయక్ తీసిన ఠాగూరు సినిమా లోని చిరంజీవి గారి పటం. అది చూసి మా నాన్నగారు క్షణ కాలం విస్మయానికి గురయినా తేరుకుని, తను అడిగింది ఏ ఠాగూరు పటమో అతనికి చెప్పారట. ఇది విన్న వెంటనే నాకు ఒక్కసారిగా నవ్వొచ్చినా తరువాత బాధ కలిగింది. సినిమాలు యువత పై ఇంతటి ప్రభావాన్ని చూపిస్తాయా అని. ఆ ప్రభావం ఎంతటి గాఢమైనదంటే విశ్వకవి కవిత్వం కంటే బలంగా వినాయక్ ఠాగూరు ప్రజల్లో నాటుకుందా అనేంత. కానీ అన్ని సినిమాలూ ఇలాగే ప్రభావం చూపిస్తాయంటే అదీ చెప్పలేం. చెడు, హింస ఆకట్టుకున్నంత వేగంగా సత్యాగ్రహాలూ, సందేశాలూ ఆకట్టుకోవుగా మరి.

Read Full Post »

      నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇష్టం కంటే ప్రాణం అంటే బావుంటుందేమో!  రోజూ పొద్దున్నే చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగనిదే నాకు రోజు మొదలవదు. అలానే సాయంత్రం మళ్ళీ ఇంకో కప్పు కాఫీ సేవిస్తేనే రోజు పూర్తవుతుంది. అయితే ఇది చాలా మందికి వుండే అలవాటేగా ఇందులో వింతేముంది అని మీకు సందేహం రావచ్చు. సమస్యల్లా నా ఈ అలవాటు లో ఏ మాత్రం తేడా వచ్చినా నేను సతమతమైపోతాను. సమయానికి కాఫీ నీళ్ళు గొంతులో పడకపోతే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. నా ఈ ఇష్టాన్ని చూసి చాలామంది నాకు కాఫీ పిచ్చి అనీ, నేను కెఫీను డిపెండెంటుననీ బిరుదులిచ్చేసినా సగర్వంగా స్వీకరించాను.

      అసలీ కాఫీ పైన ఇంత మక్కువ జీన్సు వల్లనే సంక్రమించిందని అనుకుంటూంటాను నేను. ఎందుకంటే, మా నాన్నగారికి కాఫీ పై మక్కువ నాకంటే ఒక రవ్వ ఎక్కువ. అందుకు ఋజువు ఎప్పుడూ ఆయన గదిలో మేకుకు వేళ్ళాడే కాఫీ ప్లాస్కే. మా అమ్మ పూజలో, పనిలో ఉన్నప్పుడు మాటిమాటికీ కాఫీ కలపమని అడిగితే విసుక్కుంటుందని ఒకేసారి ఫ్లాస్కులో పోయించేసుకుని ఆరారా సేవిస్తుంటారు మా నాన్నగారు. ఇకపోతే ఇంత చిన్నప్పుడే కాఫీ ఏంటని మా అమ్మ నా చేత కాఫీ మానిపించటానికి చేయని ప్రయత్నం లేదు. తన ప్రయత్నాలన్నీ  విఫలమవ్వటంతో ఆఖరికి నా బలహీనతను నా బలం కోసం వాడుకునే ఉపాయం కనిపెట్టింది మా అమ్మ. చిన్నప్పుడు నేను కాస్త బలహీనంగా ఉండటం చేత డాక్టరు రాసిచ్చిన ప్రొటినెక్సు (పాలల్లో కలుపుకుని తాగే పొడి) నా చేత తాగించటానికి మా అమ్మ ఒక పావు కప్పు కాఫీ ని నాకు కొ/ఎసరు గా చూపించేది. దాని కోసం నేను కళ్ళూ, ముక్కూ మూసుకుని మూడు గుక్కల్లో మందు కంపు కొట్టే ఆ ప్రొటినెక్సు పాలని మింగేసి, తరువాత మా అమ్మ చేతి కమ్మని సువాసనలు వెదజల్లే నురగల కాఫీని ఆస్వాదించేదాన్ని.  

      ఇదిలా దావనలంలా వ్యాపించి నా స్నేహితులూ, సన్నిహితులూ నేను వాళ్ళింటికి వెళ్తున్నానంటే పాపం! వారికి కాఫీ అలవాటు లేకపోయినా కాఫీపొడి కొని ఉంచటం మొదలుపెట్టారు. మా చుట్టాలిళ్ళకి వెళ్ళినపుడు మా పెద్దమ్మ లు అందరినీ అడిగినట్లే నన్ను కూడా “కాఫీ తాగుతావుటే?” అని అడిగి అంతలోనే సర్దుకుని “దీనికి కాఫీ పిచ్చి కదూ!” అని లోపలికి వెళ్ళి అందరికీ ఇచ్చే కంటే మరికాస్త ఎక్కువ పోసి పెద్ద గ్లాసుతోనే సమర్పించుకునేవారు.  కాఫీ అంటే ఎంత ఇష్టమున్నా ఏ కాఫీ పడితే ఆ కాఫీ తాగనండోయ్. కాఫీ అంటే నా నిఘంటువులో ఒకే ఒక అర్థం ఉంది. అది ఏ దేశానికి చెందినదైనా అచ్చమైన డికాక్షను కాఫీ మాత్రమేనని. బ్రూ కాఫీలూ, నెస్కెఫేలూ లాంటివి తాగి (అవంటే ఇష్టమున్న వారు మన్నించాలి) నా శరీరాన్ని, పవిత్రమైన కాఫీ పైనున్న నా ప్రేమనీ కల్మషం చేసుకోలేను.

      దిష్టేమైనా తగిలిందో ఏమో గానీ, ఇంత ఇష్టమైన ఈ కాఫీ ని కావలసినన్ని సార్లు మనశ్శాంతిగా తాగుదామంటే ఎప్పుడూ కుదరదు. ఎందుకంటే నాకెప్పుడు ఒంట్లో బాగోక డాక్టరు దగ్గరకు వెళ్ళినా అదేంటో విచిత్రం గా, “మీరు కెఫీను తగ్గించాలండీ!” అంటాడు. (వాడి కన్ను కుట్టిందో ఏమో! వాడి ముందు కాఫీ గానీ తాగానా ఏవిటి కొంపతీసి?) ఆయనలా చెప్పీ చెప్పగానే నేను ముందుగా జాగ్రత్తపడతాను. కాఫీ మానేసేననుకునేరు. ఇంకా నయం, ముందు ఈ విషయం మా వారికి తెలీకుండా జాగ్రత్తపడతాను. తెలిసిందా ఇంక అంతే సంగతులు. కాఫీ ఒక్క పూటైనా మానేయమని సతాయింపులు, సాధింపులు. అవి పడలేక ఒక్కోసారి మానేసానని అబద్ధమాడి అనఫీషియల్ గా ఏ మధ్యాహ్నం వేళో తాగేస్తుంటాను. 

      అదేవిటోగానీ, కాఫీ మానమని నన్ను పోరిన వారే గానీ కాఫీ గొప్పతనాన్ని గుర్తించిన వారు లేరు. గొప్ప గొప్ప వాళ్ళంతా కాఫీ లు తాగి బుర్ర పదును చేసుకున్నవాళ్ళే కదా. ఆ మాట కొస్తే ఈ సోదంతా రాయటానికి నాకు ఓపికనిచ్చిన టానిక్ కూడా కాఫీనే. ఆఖరుగా ఒక మాట చెప్పాలి ఎంతమంది చెప్పినా ఒక్క పూట కూడా కాఫీ మానని నేను మా అమ్మ కి బాగోనపుడు మా అమ్మ కి నయమవ్వాలని బాబా కి మొక్కుకుని నెల రోజులు కాఫీ మానేసాను. 

      ఏది ఏమైనా నా బలమూ, బలహీనతా రెండూ కాఫీనే. సర్లెండి, బ్లాగు రాయటంలో పడి మర్చేపోయాను. కాఫీ వేళ మించిపోయింది. ఈ పూట ఇంకా కాఫీ తాగనే లేదు.

Read Full Post »

ఈ ప్రశ్న పురాణకాలం నుంచీ అడుగుతున్నదైనా ఈనాటికీ సమాధానం మాత్రం దొరకలేదు. రోజులు మారాయి ఆడవాళ్ళు ఏదైనా చేయగలరని అనుకుంటున్న ఈ రోజుల్లో నిప్పుల కొలిమిలో నిలువునా కాలిపోతున్న మహిళలు ఇంకా ఎందరో వున్నారు. ఉదాహరణ నా స్నేహితురాలి కధే. నా చిన్ననాటి స్నేహితురాలి జీవితం పెళ్ళి అయిన మూడునాళ్ళకే కన్నీళ్ళ పర్యంతం అయింది. తన పెళ్ళి అయిన నెల లోపే నేను విన్న మొదటి వార్త తను భర్తని వదిలి వచ్చేసిందని. నేను షాక్ తో తనకి ఫోన్ చేసినపుడు తన భర్త ప్రవర్తన నచ్చకే వచ్చేసాననీ ఇంకేమీ అడగద్దనీ అనటంతో నేను మరేమీ మాట్లాడలేకపోయాను. కొద్ది రోజుల గడువు తరువాత నేను మరొకసారి తనతో మట్లాడటానికి ప్రయత్నిస్తే నా స్నేహితురాలి అమ్మగారు ఫోన్ తీసారు. నేను నా స్నేహితురాలి గురించి వాకబు చేయగానే, ఆవిడ తన కూతురుకు తనకు ఏ సంబంధం లేదనీ, భర్తను వదిలి వచ్చిన దానితో ఎవరూ మాట్లాడమనీ చెప్పి ఒకటే చీవాట్లు నా స్నేహితురాలిని. ఆఖరికి వాకబు చేయగా తను వేరే వూరిలో వుండి చదువుకుంటోందని తెలిసింది. పోనీలే మనసు మరొకదానిపైన మళ్ళించి మంచిపని చేసిందని అనుకున్నా, “ఇంత తొందరపాటు పని ఎందుకు చేసింది? కొద్ది రోజులు భర్త ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసి ఉండచ్చు కదా!” అని నా మనసులో అనుకోకుండా ఉండలేకపోయాను. అలా ఒక సంవత్సరం గడిచింది. నేను వీలు దొరికినపుడల్లా నా స్నేహితురాలి యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నాను. తను చదువును కొనసాగిస్తూ, కాలాన్ని వృధా చేయకుండా ఎవరి అండ దండా లేకుండా గడుపుతుంటే తన గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కానీ మనం సంఘం మధ్య, కట్టుబాట్ల సంకెళ్ళ మధ్య ఉన్నామని, అవి మన బతుకు మనల్ని బతకనివ్వవని ఆ క్షణం మరిచాను.  

      ఒక రోజు నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తను తన భర్త దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్పింది. రేపో మాపో విడాకులు తీసుకోవాలనుకుంటున్న తనలో ఈ మార్పు ఏమిటని అశ్చర్యం వేసింది. తన నిర్ణయం వెనుక తన తల్లితండ్రుల ఒత్తిడి చాలా వుందని, వారు తన వల్ల బయట ఎవరికీ మొహం చూపించలేకపోతున్నారనీ పైగా వారి అండ లేకుండా తను ఎన్నాళ్ళు ఒంటరిగా ఉండగలననీ అంది. తన భర్త కూడా తన రాకకు సరే అన్నాడనీ అంటే పోనీలే అంతా తన మంచికే జరిగిందని అనుకున్నా. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి సుఖంగా ఉందని అనుకుంటున్న సమయం లో మరొకసారి తనకి ఫోన్ చేస్తే, తన కొత్త జీవితం ఎలా ఉందని అడిగితే, ఆమె సమాధానం ‘నరకం’ లా ఉందని. తన భర్త ఏ మాత్రం మారలేదనీ, అతనికి లేని దురలవాటు లేదనీ, శారీరకంగా మానసికంగా హింసననుభవిస్తున్నాననీ అంటే గుండె తరుక్కుపోయింది. ఆమెని తిరిగి కాపురానికి రమ్మన్నది కట్నం వెనక్కి ఇవ్వాల్సి వస్తుందన్న కారణం చేతనేననీ అన్నది. పోనీ ఈ నరకం నుంచి వెళ్ళిపోదామంటె తన తల్లితండ్రులు ఛస్తామని బెదిరించటం వల్ల వేరే దారి తనకు లేదని అంటే నా చిన్ననాటి స్నేహితురాలి కోసం ఏమీ చేయలేని అశక్తురాలినై పోయాను. ఆమె తల్లి తో మాట్లడితే ప్రయోజనం ఉంటుందనుకుంటే, కూతురు ఏమైపొయినా ఫరవాలేదు కానీ తనకి పరువే ముఖ్యం అనే ఆమె సమాధానానికి ఆమెని నిందించాలో లేక ఆమెనలా మార్చిన లోకాన్ని నిందించాలో తెలీక మరోసారి అశక్తురాలినైపోయాను. ఉన్నత చదువు చదివీ తన బతుకు తను బతకలేక, భర్త కాళ్ళ కింద పడుండమని తల్లే చెప్తుంటే మౌనంగా రోదిస్తున్న నా స్నేహితురాలి జీవితం ప్రతి క్షణం కళ్ళ ముందు మెదులుతుంటే, కట్టుబాట్లని, సంఘాన్ని అసహ్యించుకోవటం తప్ప మరేమి చేయగలను. ఎంతమంది వీరేశలింగాలు పుట్టినా, ఎంతమంది గాంధీలు పుట్టినా, మారని సంఘం, లోకులు, ‘స్త్రీ కి స్త్రీ యే శత్రువు’ అనే మాటని నిజం చేస్తున్న తోటి స్త్రీ లు ఉన్నంతవరకూ స్త్రీ స్వాతంత్ర్యం మాత్రం కలలో మాటే. 

Read Full Post »

ఆమె చూపులు వెన్నెల కన్నా చల్లనివి
ఆమె మనసు మల్లెల కన్నా మెత్తనిది
ఆమె ప్రేమ సంద్రం కంటే లోతైనది
ఆమె పలుకులు అమృతం కంటే తీయనివి
ఆమె అన్నిటి కన్నా అపురూపమైనది
ఆమే ‘అమ్మ’

Read Full Post »

నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ,

వసుంధర. 

Read Full Post »

ఇన్నాళ్ళూ నా భావాలు
సెలయేటి లో చిరు చినుకులు
ఈ నాడు నా భావాలు
సముద్రంలో ఉప్పొంగే కెరటాలు

Read Full Post »

ఈ మధ్య శంకర్ దాదా జిందాబాద్ సినిమా విడుదలయ్యాక అన్ని వెబ్ సైట్ల లోను ఒకటే మాట. సినిమా ‘ఏ’ సెంటర్ల లోనే బాగా ఆడుతోందని, ‘బి’, ‘సి’ సెంటర్ల వాళ్ళకి గాంధీయిజం పట్టలేదని ఆన్ లైను పత్రికలన్నీ కోడై కూసాయి. ప్రతి చెత్త సినిమానీ పొగిడేసే పత్రికల వాళ్ళు ఈ సినిమానికి మాత్రం ‘3’ రేటింగు ఇవ్వటం ఇవన్నీ చదివి కొద్దిగా మనసు కలత చెంది ఇది రాస్తున్నాను. పత్రికల వాళ్ళ సంగతి వదిలేస్తే నా వరకు నాకు సినిమా బాగా నచ్చింది. ఈ మధ్యన ఇలాంటి మంచి సందేశాలు వున్న సినిమాలు కరువైపోయాయి.  సరదాగా సాగిపోతూ అంతర్లీనంగా సందేశాన్ని నింపుకుని గాంధీ సిద్ధాంతాలని గాడ్సే కి కూడా అర్ధం అయ్యేలా అరిటిపండు వలిచి చెప్పినట్లుగా ఈ సినిమాలో చెప్తే ఇది ఎందుకనో మాస్ కి అర్ధం కాలేదట. ఇది పత్రికల వాళ్ళ భ్రమా లేక నిజంగానే మాస్ కి ఇది అర్ధం కాలేదా? మరి డబుల్ మీనింగ్ డైలాగులు చాలా సులువుగా అర్ధం చేసుకునే ఈ మాస్ అనబడే ప్రజానీకం రెండే రెండు మాటలైన సత్యం, అహింస అనే పదాలని అర్ధం చేసుకోలేకపోయారంటే ఇది నిజంగా సిగ్గు చేటు.

ఆనాడు గాంధీ గారి పిలుపుతో యెంతో మంది విద్యాధికులు వున్న వుద్యోగాలు, ఆస్థిపాస్థులు, అన్నీ   వదిలేసి స్వాతంత్రం కోసం వెళ్తే, వేల మంది చదువు రాని ప్రజలు గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వాతంత్ర సమర బావుటా ఎగురవేయటానికి జైళ్ళకు కూడ వెళ్ళారు. వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు, మన భాషలో చెప్పాలంటే మాస్, క్లాస్ అందరూ వున్నారు. చదువు రాకపొయినా తాము వెర్రి గొర్రెలం కావని,  వుద్యమాలతో బ్రిటీషు వారికి యుద్ధానికి ఆయుధాలు అఖ్ఖర్లేదని అహింస, సత్యగ్రహమే చాలని కొత్త అర్ధం చెప్పిన భారత ప్రజలు అదే గాంధియిజాన్ని మరో అరవయ్యేళ్ళ తర్వాత చెప్తే అర్ధం చెసుకోలేకపొయారా? రోజు రోజు కీ తెలివితేటలు పెంచుకుంటూ, ప్రపంచంతో పరుగెట్టే ఈనాటి ప్రజలకి సులువైన మహాత్ముని మాటలు చెవినపడలేదా లేక యానా గుప్తా వంపుసొంపులతో, పాటతో కళ్ళు, మనసూ రెండూ మూసుకుపోయాయా? అదే గనుక జరిగితే విశ్వకవి రవీంద్రుడన్నట్లు, “ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో ఆ స్వేఛ్ఛా స్వర్గానికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు” అని ప్రార్ధించటం తప్ప చేయగలిగేదేముంది?

Read Full Post »