Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఆగస్ట్ 31st, 2007

నేను యెనిమిదో తొమ్మిదో చదువుతున్నాననుకుంట అప్పుడు. మా ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగారు ఒక కుటుంబం.  పురుషోత్తమ శర్మ గారని, పెద్ద కుటుంబమే వాళ్ళది.  ఆయన, ఆయన భార్య, ముగ్గురు ఆడ పిల్లలు సత్య, శుభ, పవన ఇంకా ఈ పిల్లల బామ్మ గారు వెరసి మొత్తం ఆరుగురు.  పిల్లలు ముగ్గుర్లో సత్య, పవనా కొంచెం అటూ ఇటూగా నా ఈడు వాళ్ళే. శుభ కొంచెం పెద్దది. నాకైతే వీళ్ళందర్నీ చూడగానే భలే సంతోషం వేసింది. ఎంచక్కా రోజూ ఆడుకోవచ్చునని. అయితే వాళ్ళని పరిచయం చేసుకుందామని మా మేడమెట్ల వైపున్న వాళ్ళ వాటా వైపు వెళ్ళానా అక్కడ ఆ ముగ్గురూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంటి వోనరు అమ్మాయి వచ్చిందని కూడా పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏమిటా అని అక్కడే నిల్చుని వింటుంటే ఒక్క ముక్కా అర్థం కావట్లేదు. వినటానికి తెలుగు లానే ఉంది కానీ ఏదో తేడాగా ఉంది ఆ భాష. ఎంతసేపటికీ వాళ్ళు నన్ను పట్టించుకోకపోతే చూద్దాం వీళ్ళ టెక్కు ఏంటో అని నేనే వెళ్ళి నన్ను నేను పరిచయం చేసేసుకున్నా. వాళ్ళని కూడా వాళ్ళు పరిచయం చేసుకున్నాక మళ్ళా నా ముందే మొదలెట్టారు ఆ వింత భాష. అమ్మో వీళ్ళకేవో భాషలు వచ్చల్లే వుందని ఇంక స్టైలు కొట్టటం ఆపి ప్లీజ్, ప్లీజ్ నాకూ నేర్పరూ ఈ భాష! ఈ రోజు నుంచీ మనమంతా ఫ్రెండ్స్ అన్నా. సరేనని వాళ్ళు ముగ్గురూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని మళ్ళీ ఆ వింత భాషలో ఏవో గొణుక్కుని ఆఖరికి సరేనన్నారు. ఇంతాచేసి ఆ వింత భాష ఏంటా అని అడిగితే అది తిరగేసి భాష అట. వాక్యం లోని ప్రతి పదాన్నీ తిరగేసి మాట్లాడుతూ వాక్యం పూర్తి చేస్తారన్నమాట. అప్పటిదాకా క భాష జ భాష మాత్రమే విన్నాన్నేను. వినటమే కాదు అనర్గళంగా మాట్లాడగలను కూడా. నాకు రాని ఈ తిరగేసి భాషని ఎలాగైనా నేర్చుకుని తీరాలని అప్పటికప్పుడే తీర్మానించేసుకున్నా. వినటానికి సులువు గానే వున్నా మాట్లాడటానికి మాత్రం చాలా ప్రాక్టీసు కావాలనిపించింది.  పైగా వీళ్ళైతే చాలా మామూలుగా మాట్లాడినట్లు తడబడకుండా మాట్లాడేస్తున్నారు. వీళ్ళు నేర్పినా అంత బాగా నేనెప్పటికి మాట్లాడుతానో అని అప్పుడే బెంగొచ్చేసింది నాకు.  అయినా సరే పట్టువదలని ఝాన్సీ రాణీలా నాకు నేనే శపధం చేసుకున్నా ఈ భాష అంతేమిటో చూద్దామని.  అప్పటినుండి మొదలు ప్రతిరోజూ వాళ్ళ దగ్గర నేర్చుకోవటం ఇంట్లో మళ్ళీ ప్రాక్టీసు చేయటం. స్కూల్లో సమయం దొరికినా నాలో నేను లోపల మనసులో ఆ భాషలో మాట్లాడుకుంటూ, టచ్ పోకుండా రోజూ సాయంత్రాలు నా ముగ్గురు స్నేహితులతో ఈ భాషలోనే ముచ్చటిస్తూ, సందేహాలుంటే తీర్చుకుంటూ బాగా సాధన చేసాను. మొత్తానికి మట్లాడడమైతే వచ్చేసింది కానీ వాళ్ళు మాట్లాడుతుంటే విని అనువదించుకుని అర్థం చేసుకోవటానికి కొంచెం సమయం పట్టింది. ఎలాగైతేనేం అది కూడా వచ్చేసాక ఏదో ప్రపంచాన్ని జయించినంత సంతోషం వేసేసింది.  ఇంక అది మొదలు మేము నలుగురము బజారుకు వెళ్ళినా, షికారుకు వెళ్ళినా ఈ తిరగేసి భాషలో అందరి ముందూ గొప్పగా మాట్లాడేసుకుంటూ, అదేంటో అర్థం కాని వాళ్ళ వంక కొంచెం జాలిగా, మరికొంచెం గర్వంగా చూస్తూ తెగ విర్రవీగేవాళ్ళం.  ఇదికాక ఎవరినైన వాళ్ళ ముందే ఏడిపించుకోవటానికీ, తిట్టుకోవటానికీ కూడా భలేగా పనికి వచ్చేదీభాష. అసలు మేము మామూలుగా మట్లాడటం ఎలాగో మర్చిపోయాం ఈ భాష వచ్చాక. నేను వాళ్ళ దగ్గరకొచ్చి, “మిఏ రున్నాస్తుచే?” అంటే వాళ్ళు మీఏ దుట్లేయచే. రుజాబ కు మాళ్దావె? అనేవారు. ఇలా కనపడిన వాళ్ళ ముందూ, కనపడని వాళ్ళ ముందూ ఈ భాష లో వాగుతుండటం వల్ల ఎవరో వెళ్ళి, శర్మ గారి అమ్మాయిలు ఏదో పాకీ బాష మాట్లాడుతున్నారని అందరూ అంటున్నారని చల్లగా నా స్నేహితురాళ్ళ నాన్నగారి చెవిన వేసారు. ఆ ఏదో పిల్లలు లెద్దూ అని మొదట్లో ఏమీ అనలేదు మా వాళ్ళు.

     బయట ఇంత వాగినా ఇంట్లో వాగేవాళ్ళం కాదు తిడతారని. అయినా పొరపాటున ఇంట్లోవాళ్ళ మధ్య అప్పుడప్పుడూ వచ్చేస్తూ వుండేది ఈ భాష. అలా పొరపాటున ఎవరైనా వాగితే నవ్వుకోలేక చచ్చేవాళ్ళం. ఇలా మా వెకిలి నవ్వులూ, వెర్రి భాషా చూసి మా ఇంట్లోనూ నా స్నేహితురాళ్ళింట్లోనూ నిజంగానే ఇదేదో పాకీ భాష ఏమోనని అనుకుని మాకు పెద్ద వార్నింగు ఇచ్చారు. ఈ బాష మాట్లాడితే మూతి మీద వాత పెడతామని. అలాగేలెమ్మని మానేసామని చెప్పాం కానీ అలవాటుపోయేదికాదు.  అటుపై మొదలు అన్నాళ్ళూ సగర్వంగా మాట్లాడుకున్న ఈ భాషని రహస్యంగా మాట్లాడుకోవలసి వచ్చేది.  మా ఖర్మగాలి నా స్నేహితురాళ్ళ బామ్మ గారు కానీ విన్నారా ఇంక మొదలెట్టేవారు తిట్లు అవి వినలేకచచ్చేవాళ్ళం. ఆవిడకి పాపం తన, పర బేధం ఉండదు. తిట్టేటపుడు నన్ను కూడా కలిపి మరీ తిట్టేవారు. ఏమైతేనేం మరికొన్నాళ్ళు మా రహస్య భాషని కొనసాగించాము. కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు మా సాధన ముదిరి ఈ భాష లో మేము పాటలూ అవీ కూడా పాడటం మొదలెట్టాము. ఆ చెవినా ఈ చెవినా అవి విన్న మా ఇంట్లోవాళ్ళు మాకేదో గాలో, ధూళో సోకిందని భయపడటం మొదలుపెట్టారు. వాళ్ళ భయం చూసి కొంపతీసి ఏ భూతవైద్యుడి దగ్గరకో తీసుకెళ్ళి బడితపూజ చేయిస్తారేమోనని భయపడి దెబ్బకి ఈ సిగేరతి షభాని అదే తిరగేసి భాషని మట్లాడటం మనసు చంపుకుని మరీ మానేసాం. 

Read Full Post »