Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for సెప్టెంబర్ 6th, 2007

“సుజ్జుబేటీ, ఏం చేస్తున్నావే!” అని పిలవగానే కాలేజీ ఉందన్న ఖంగారు ఏ మాత్రం లేకుండా నిదానంగా పుస్తకాలు పట్టుకుని బయటకు వచ్చేది సుజాత. అక్కడి నుంచి కబుర్లు చెప్పుకుంటూ అరమైలు దూరం లో ఉన్న బస్టాండు దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ రాజమండ్రీ బస్సెక్కి కాలేజీకెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఈసురో గోడో మంటూ ఇంటికొచ్చేదాకా నాతోపాటుగా సుజాతే ఉండేది. నేను ఇంటరు ఫస్టు ఇయరు లో చేరటానికి వెళ్తున్నప్పుడు సుజాత నాకు మొట్టమొదటి సారిగా పరిచయం. అప్పుడు మా అమ్మా, నేనూ బస్సు లో రాజమండ్రీ కాలేజీకి ఇంటరు అప్ప్లికేషను పెట్టటానికి వెళ్తున్నాం. అదే బస్సులో ఉన్న సుజాత కూడా నేను చేరబోతున్న కాలేజీలోనే చేరుతోందని తెలిసి మా అమ్మ మొహం లో బెంగ అంతా పోయి ఒక్కసారిగా కళ వచ్చేసింది. “రోజూ ఇద్దరూ కలిసి వెళ్ళండమ్మా” అని మా అమ్మ నాకూ సుజాతకూ జత కట్టేసింది. “అలాగేనండీ, మీరేమీ ఖంగారుపడకండి నేనుంటానుగా.” అని ముదిపేరక్క లాగా ధైర్యం చెప్పింది మా అమ్మకి. అది మొదలు సుజాతకీ నాకూ పరిచయం, స్నేహం. ఇంటరు అంతా కలిసేవున్నా ఎందుకో ఇంటరు సెకండు ఇయరు ఆఖరికి వచ్చాకగానీ సుజాతా నేనూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వలేదు. ఆ తర్వాత డిగ్రీ రాజమండ్రీ ఉమెన్సు కాలేజీలో బీకాంలో కలిసి చేరాం.

     సుజాతని నేను ముద్దుగా “సుజ్జుబేటీ” అని పిలిచేదాన్ని. అలా ఎందుకు పిలిచేదాన్నో తెలీదు కానీ ఆ పిలుపులో ఎంతో ప్రేమ, ఆప్యాయత కలబోసి పిలిచేదాన్ని. అదంటే నాకంత ఇష్టం మరి. అసలు మా ఇంటిపక్కనే ఉన్న రేవులో బస్సులాగేవి. అయినా సుజాత తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళటం కోసం అరమైలు దూరం దానింటిదాకా నడిచి అక్కడి నుంచి మరో అరమైలు దూరం లో వున్న పెద్ద బస్టాండుకెళ్ళి అక్కడ బస్సెక్కేదాన్ని. సుజాత కాలేజీకి వెళ్ళకపోతే నేనూ వెళ్ళేదాన్ని కాదు. అలాగే నేను మానేసిన రోజున అదీ మానేసేది. మా ఇద్దర్నీ చూసి మా ఇంగ్లీషు టీచరికి వొళ్ళు మండిపోయేది. ఇద్దరూ వస్తే వస్తారు లేకపోతే ఇద్దరూ మానేస్తారా అని ఆవిడకి కోపం. పైగా మేము మెరుపు మెరిసినట్లు అప్పుడప్పుడూ మాత్రం మెరుస్తామని ఎగతాళి చేసేది. ఆవిడన్నమాటా నిజమేలెండి! అస్తమానూ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకెళ్ళిపోయేవాళ్ళం సుజాతా, నేనూ. మేము మోర్నింగు షో సినిమా ప్రోగ్రాము పెట్టుకున్న రోజు, రోజూ కంటే త్వరగా సుజాతింటికెళ్ళి “సుజ్జుబేటీ రావే కాలేజీకి టైమైపోతోంది” అనగానే సుజాత కంటే రెండేళ్ళు చిన్నవాడైన సుజాత తమ్ముడు తాపీగా వచ్చి “ఏం సినిమాకీ” అనేవాడు. “సినిమా ఏంటి” అని నేను అమాయకంగా అంటే, “ఛా మీరెప్పుడైనా కాలేజీ టైమైపోతోందని ఖంగారుపడ్డారా” అని సెటైరు వేసేవాడు. రోజూ లా నిదానంగా కాకుండా ఆదరాబాదరాగా వచ్చిన సుజాత “సర్లే బాగానే కనిపెట్టావు గానీ  ఇంట్లో వాగావంటే అయిపోతావు” అని వాడికి వార్నింగు ఇచ్చి మరీ వచ్చేది.  ఎంత కాలేజీ ఎగ్గొట్టినా ఒక్కరోజు కూడా మా అకౌంట్స్ ట్యూషను మాత్రం మానేవాళ్ళం కాదు. కాలేజీలో ఏవీ చెప్పేడవరు కనుక ట్యూషన్ మీదే డిపెండు అయ్యేవాళ్ళం. పరీక్షలు దగ్గరకి వస్తున్నప్పుడు కంబైండు స్టడీ చేసి రాత్రీ పగలూ చదివేసి ఎలాగోలా మార్కులు తెచ్చేసుకునేవాళ్ళం.

     అసలు సుజాతే లేకపోతే నా కాలేజీ రోజులు నిస్సారంగా ఉండేవేమో!  అది రానపుడు కాలేజీకెళ్తే నాకు ఏమీ తోచేది కాదు. మా క్లాసులో అందరూ మార్కుల వారీగా, కులాల వారీగా స్నేహం చేసేవారు. అలా తయారైన గ్రూపుల్లో నేను ఇమడలేకపోయేదాన్ని. ఇక బస్సులో ఎవరైనా పోకిరీ వెధవలు ఏడిపిస్తారేమోనని మరో బెంగ. సుజాత నా పక్కనుంటే నాకు ఎనలేని ధైర్యం వచ్చేసేది. పైగా అలాంటివాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో దానికి బాగా తెలుసు.  డిగ్రీ రెండేళ్ళూ అదీ నేనూ చూడని సినిమా లేదు, లంచ్ టైములో తినని చిరుతిండి లేదు. బొప్పాయిముక్కలూ, పుచ్చకాయిముక్కలూ, జామకాయిలూ, దిల్ పసందులూ, వేరుసెనక్కాయిలూ లాంటివి తింటూ చెప్పుకోని కబుర్లు లేవు, వేసుకోని జోకుల్లేవు. అలా సరదాగా మా స్నేహం సాగిపోతుండగా డిగ్రీ సెకండియర్లో ఒకరోజు సుజాత నాతో చెప్పింది తనకు పెళ్ళికుదిరిందని.  పైగా తను అక్కడితో చదువు ఆపేస్తున్నానని కూడా చెప్పింది.  అది సంతోషకరమైన వార్త అయినా నేను మాత్రం ఎక్కెక్కి ఏడ్చాను. నాతోపాటుగా ఎప్పుడూ ఉంటూ నన్ను నవ్వించే సుజాత,  ఇంటరులో మా అమ్మ పోయినప్పుడు నన్ను ఓదార్చి నా వెంటే వున్న సుజాత ఇక నాతో ఉండబోదని తెలిసిన ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. తన పెళ్ళయ్యాక కూడా మన స్నేహం ఇలాగే కొనసాగుతుందని మాటిచ్చిన సుజాత పెళ్ళి తర్వాత సంసారంలో పడిపోయింది. తర్వత నేనూ పెళ్ళిచేసుకుని అమెరికాకి వచ్చేసాను. మేమెంత దూరంలో ఉన్నా నా మనసులో సుజాత మాత్రం అలానే ఉండిపోయింది. ఆ మధ్య ఇండియా వెళ్ళినపుడు ఒకటి రెండు సార్లు తనని కలవాలని వాళ్ళింటికెళ్తే తను వాళ్ళ అత్తగారి వూర్లో ఉందని చెప్పారు. ఈసారి ఇండియా వెళ్తే తప్పకుండా సుజాతని కలవాలి. కలిసి ఎన్నో కబుర్లు చెప్పాలి. ఆ మధ్య రాజమండ్రీ బస్టాండులో అప్పట్లో మేము వేరుసెనగక్కాయలు క్రమం తప్పకుండా కొనే వెరుసెనక్కాయలతను కనిపించి “మీతోపాటుండే ఆ పాపగారేరండీ” అని అడిగాడు ఆ విషయం కూడా సుజాతకి చెప్పాలి.

Read Full Post »