నాకు పెళ్ళయిన వెంటనే బెంగుళూరుకు వచ్చేసాను. వచ్చిన వారం లోపే అనుకుంటాను ఒకరోజు ఏమీ తోచక బయట బాల్కనీ లో నిల్చున్నాను. ఆ ఇంట్లో మేము పైన అద్దెకుండేవాళ్ళం కింద ఇల్లుగలవాళ్ళు ఉండేవాళ్ళు. చుట్టూ చూస్తుంటే ఇంచుమించు మా డాబా కి ఆనుకుందా అన్నంత దగ్గర్లో ఉన్న పక్క మేడ మీద గోధుమ రంగులో ఉన్న ఒక కుక్క నా వైపే చూస్తూ తోకాడిస్తోంది(నేనెవరో తెలీకపోయినా). దాన్ని చూడగానే ముద్దొచ్చి లోపలికెళ్ళి దానికి తినటానికి ఒక బిస్కట్టు తెచ్చి పక్క డాబా మీదకు విసిరాను. అది ఆవురావురుమని తినేసింది. ఇంకాకొన్ని విసురుదామంటే ఎవరైనా చూస్తే బాగోదని అనిపించి “ఇలా ఇటురా ఇంకా పెడతాను” అని అంటూ సైగ చేసాను. అలా అన్నానే కానీ నా మొహం దానికేం అర్థమవుతుంది, పైగా తెలుగులో అన్నాను అదేమో కన్నడ కుక్కాయె అని లోపలికెళ్ళాను. అంతలోనే “కుయ్ కుయ్” మని వినిపిస్తే బయటకెళ్ళి చూద్దును కదా! పక్క డాబా గోధుమరంగు కుక్క నా ముందుంది. ఒక్కసారి ఆశ్చర్యపోయినా అంతలోనే తేరుకుని దానికి మిగతా బిస్కట్టులు పెట్టి అబ్బో ఇది చాలా తెలివైన కుక్క లా ఉందని అనుకున్నాను. అప్పటినుండీ ఇంక అది నన్ను వదిలిపెడితే ఒట్టు. పక్క డాబా మీది దాని మకాం మా డాబా మీదకి మార్చేసింది. తోకవూపుతూ అది చూపించే ప్రేమకి నేను కూడా కరిగిపోయాను. నేనెందుకో దానికి బాగా నచ్చుంటానని తెగ సంబరపడిపోయాను కూడా. వెర్రిదాన్ని! నాకేంతెలుసు అది ఎవర్ని చూసినా అలాగే తోకూపుతుందని. సాయంత్రం మా ఆయన రాగానే దాన్ని చూపించాను కదా! పొద్దున్న చూపించిన ఆప్యాయతంతా అది తన దగ్గర చూపించేసింది. అమ్మో గడుసుదే ఇది అనుకుని ఆ రోజునుంచీ దానికి ఫుల్ మీల్స్ ఇవ్వడమే కాక దానికి “సోనా” అని నామకరణం కూడా చేసేసాను దాని గోధుమ రంగు చూసి.
ఒకరోజు పొద్దున్నే మా ఇంటి ఓనరు పైకొచ్చి మా తలుపు దబ దబా బాదాడు. ఏంటా అని చూస్తే మా వారినీ నన్నూ బయటకి రమ్మని చెప్పి “ఇదుగో చూడండి మీరు చేరదీసిన కుక్క ఏంపని చేసిందో” అని ఆయనకొచ్చీరాని తెలుగులో చెప్తున్నాడు. ఆయనకంతకోపమొచ్చేంత పనేంచేసిందా అని చూస్తే అక్కడ ఒక చిరిగిపోయిన ప్లాస్టీక్ సంచీ దాని చుట్టూ ఎముకలూ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అది చూసాక నిద్రమత్తు వదిలిపోయింది దెబ్బకి. ఏ పెంటకుప్ప మీంచో ఆ ప్లాస్టీకు సంచీడు ఎముకలు తెచ్చి మా డాబా మీద పెట్టుకుని హాయిగా తిన్నన్ని తిని పారేసినన్ని పారేసిందన్నమాట. అవన్నీ తీసి శుభ్రం చేయమని నిర్మొహమాటంగా మాకు చెప్పి మా ఓనరు వెళ్ళిపోయాడు. మా ఖర్మ కొద్దీ ఆ రోజు మా పనిమనిషి రాకపోవటం వల్ల ఆ పనంతా నేనూ మా ఆయనా కలిసి ముక్కుమూసుకుని చేసాం. ఇంత జరిగినా సోనా మీద కోపం రాలేదు నాకు పోన్లే పాపం ఆకలేస్తే అదేం చేస్తుందనుకుని ఊరుకున్నాను. పైగా దాని ఫుల్ మీల్స్ కేమాత్రం ఢోకా రానివ్వలేదు కూడా. ఏ రోజైనా ఇంట్లో వంట చేయనపుడు బయట తింటే దానికి పార్సిలు కూడా తెచ్చేవాళ్ళం. ఇంతపెట్టినా అది ప్లాస్టీకు సంచీలతో ఎముకలు వగైరా తెస్తూ మా చేత తుడిపిస్తూనే ఉంది. అదేంటో ఆ రోజే విచిత్రంగా మా పనమ్మాయి మానేసేది. మా కర్మ పరిపక్వత చెందటం వల్ల కాబోలు.
సోనా కాక మాకు ఇంట్లో పమేరియన్ కుక్క ఉండేది. దాని పేరు ప్రిన్సెస్. ఒకరోజు ప్రిన్సెస్ ని వాకింగ్ కి తీసుకెళ్ళినపుడు ప్రిన్సెస్ మీదకి ఒక వీధికుక్క వచ్చింది. ఖంగార్లో ఏం చేయాలో పాలుపోలేదు నాకు. ఇంతలో ఎక్కడినుంచొచ్చిందో మరి, సోనా వచ్చి ఆ కుక్క ని తరిమి కొట్టి దాని ధైర్య సాహసాల్ని చాటుకుంది. అప్పటినుంచీ సాధారణంగా మనుషులు గానీ, జంతువులుగానీ ఎవరూ ఒక పట్టాన నచ్చని మా ప్రిన్సెస్ కి ఈ సోనా నచ్చేసింది. మేము వాకింగ్ కి వెళ్ళినపుడల్లా వెనుక సోనా మా బోడీగార్డయిపోయింది.
ఎవరెంత చెప్పినా మేము సోనాని చేరదీయటం మాత్రం మానలేదు. అది చూపించే అతి ప్రేమకి మేము మురిసిపోయేవాళ్ళం. ఇబ్బందల్లా దాని అతి చేష్టలే. పక్కనే నిల్చుంటే దాని తోక చాలా బలంగా వూపేది అప్పుడు ఠపీ ఠపీమని తగిలేది దానితోక. మమ్మల్ని రాసుకుని పూసుకుంటే గానీ దానికి హాయిగా ఉండేది కాదు. మేడమీదారేసిన బట్టలమీద హాయిగా పడుకునేది. రాత్రుళ్ళు వీధికుక్కలతో పోట్లాడుతూ మమ్మల్ని నిద్రపోనిచ్చేదికాదు. ఇవన్నీ ఇలా మేము భరిస్తుండగా ఒకరోజు మా అత్తగారూ మావగారూ వాళ్ళూ మాతో కొన్నిరోజులు గడపటానికి ఆంధ్రా నుంచి వచ్చారు. ఇంటినిండా సందడి చూసి మా ప్రిన్సెస్ కేమో విసుగూ మా సోనాకేమో సంతోషం వేసేసాయి. ఒకరోజు పొద్దున్నే మా మావగారు బాల్కనీలో కూర్చుని గడ్డం చేసుకుంటున్నారు. అంతలోనే ఆయన పిలుపు/అరుపు వినిపిస్తే వెళ్ళి చూస్తే సోనా ఆయన ఒళ్ళో కూర్చునుంది. చూడమ్మా, ఈ కుక్క వెళ్ళమన్నా వెళ్ళట్లేదు నా వొళ్ళో కూర్చుంటానంటోందని ఆయనంటే నాకు నవ్వాగలేదు. నవ్వితే బాగోదని ఎలాగోఅలా దాన్ని బతిమాలి పంపించేసాను. అలా వాళ్ళున్నన్నాళ్ళూ దాని వన్నెలూ, చిన్నెలూ చూపించేసింది సోనా. వెళ్ళేటప్పుడు మా మావగారు నన్ను పిలిచి ” చూడమ్మా ఆ కుక్క కి కాస్త చనువెక్కువిచ్చినట్లున్నావు ” అని చెప్పి మరీ వెళ్ళారు. అలా సోనా చేసిన చిలిపి పనులూ వాటికి సర్దిచెప్పలేక మేము పడిన పాట్లూ చాలా జరిగాయి. అయినా కూడా సోనా ఇంకా దగ్గరైపోయింది. దాని కళ్ళలో చాలా ఆప్యాయత ఉంటుందని మా వారు అంటారు. అంతలోనే మేము అమెరికాకి వెళ్ళాలని తెలియడంతో సోనాని విడిచి వెళ్ళటానికి చాలా బాధేసింది. ప్రిన్సెస్ అప్పటికే చనిపోయింది జబ్బు చేసి. ఉన్న ఒక్కదాన్నీ వదిలి రాలేకపోయాను. కానీ తప్పలేదు. ఇండియా లోనే వేరే ఏ స్టేట్ కైనా అయితే సోనాని తీసుకెళ్ళిపోయేదాన్నే. మా వీధిలో సోనాని మాలా చేరదీసే వాళ్ళున్నారు. వాళ్ళకి బాగా చూసుకోమని అప్పగింతలు చెప్పి కన్నీళ్ళతో దానికి వీడ్కోలు పలికాను. అమెరికా వచ్చిన కొన్ని రోజుల తర్వాత మా ఇంటి ఓనరు భార్యకి సోనా గురించి ఫోన్ చేసాను. చాలా రోజులు ఇక్కడే ఉంది కానీ ఈ మధ్యే అదెక్కడికో వెళ్ళి మళ్ళీ రాలేదని ఆవిడ చెప్పారు. నాకు దుఃఖం ఆగలేదు. ఎలా ఉందో ఏం చేస్తోందో వెర్రిది పాపం! అని దాన్ని తల్చుకోని రోజు లేదు ఇప్పటికీ.
బాధపడకండి అని చెప్పలేనుగానీ…..
బాధను మరచిపోవడానికి సరదాగా ఈ పాట పాడుకోండి.
ఓ సోనా.. ఓ సోనా… ఓ సోనా ఐ మిస్యూ మిస్యూ రా….
ఓ సోనా.. ఓ సోనా… ఓ సోనా ఐ మిస్యూ మిస్యూ రా….
బెంగుళూర్లో పెంచుకున్న కుక్కమ్మా,
దాన్ని ‘కుక్కా’ అంటే నేను ఒప్పుకోనమ్మా,
ఆరు నెలలు నాతోపాటే ఉందమ్మా,
సోనాతో స్నేహం చేసిన కథచెపుతాను వినరమ్మా….!
పూర్తి పాటకావాలిస్తే… pravynandas@gmail.com కు ఒక చిన్న మెయిల్ పంపండి చాలు. -ప్రవీణ్
Nijam cheppana… post kante comment adirindi 😛
మనుష్యులపై ప్రేమా, విశ్వాసం చూపించే కుక్కలు ఈ ప్రపంచంలో ఎన్నొ వున్నా, భగవత్ప్రసాదితమైన ఆ వరాన్ని అందుకొనే మనుష్యులు కొందరే.
ఆ వరాన్ని అందుకొన్న మీరు అద్రుష్టవంతులైతే, మీ వాత్సల్యానికీ, కన్నీటి చుక్కలకు నోచుకొన్న ‘ సోనా ‘ ధన్య జీవి.
మీరు వెళ్ళిపోయిన తరువాత ఆ మూగ జీవి మనసు బాధపడి వుండొచ్చు అనే ఆలోచన నన్ను కదిలించి ఈ సందేశాన్ని రాయిస్తోంది.
బాగా రాసారు. మంచి టపా.
-శేఖర్
శేఖర్ గారూ, మీ వ్యాఖ్య నన్ను చాలా కదిలించింది. జంతువులని ప్రేమించే వాళ్ళని కొంతమందినే చూస్తాను నేను. అలాంటివారు కనిపించినపుడు చాలా ఆనందం వేస్తుంది. నిజమే, మీరన్నట్లు సోనా నా కోసం బాధపడి ఉంటుందేమో అని నేను చాలా బాధపడ్డాను. మనం తెంచుకున్నంత సులువుగా అవి బంధాలను తెంచుకోలేవుకదా. అందుకే అమెరికాలో ఎప్పుడైనా కుక్కని పెంచుకోవాలనిపించినా మళ్ళీ మేము ఇండియాకి వెళ్ళిపోయినపుడు ఇలాగే వదిలేయాల్సి వస్తుందనే పెంచుకోవట్లేదు. ఒక చోట స్థిరపడ్డాక ఆ పని చేయచ్చనిపించింది.
మీరు తెలిసి రాసినా తెలియక రాసినా నిజమే రాసారు. దాన్ని చూసి నేను అప్పట్లో “సోనా ఓ సోనా” అనే పాడేదాన్ని. Thanks for your appreciation nanda garu.
మీరు సొనా కి సొనా కి మీరు క్రితం జన్మ లొ రుణ పడి ఉనారెమో!జీవితంలో ఎపుడు ఏమి జరుగుతుందొ ఎవరు కలుస్తారొ మనకు తెలియదు.ఒకొక సారి జరిగినవి తలుచుకొంటె విచిత్రంగా ఉంటూందీ.