నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇష్టం కంటే ప్రాణం అంటే బావుంటుందేమో! రోజూ పొద్దున్నే చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగనిదే నాకు రోజు మొదలవదు. అలానే సాయంత్రం మళ్ళీ ఇంకో కప్పు కాఫీ సేవిస్తేనే రోజు పూర్తవుతుంది. అయితే ఇది చాలా మందికి వుండే అలవాటేగా ఇందులో వింతేముంది అని మీకు సందేహం రావచ్చు. సమస్యల్లా నా ఈ అలవాటు లో ఏ మాత్రం తేడా వచ్చినా నేను సతమతమైపోతాను. సమయానికి కాఫీ నీళ్ళు గొంతులో పడకపోతే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. నా ఈ ఇష్టాన్ని చూసి చాలామంది నాకు కాఫీ పిచ్చి అనీ, నేను కెఫీను డిపెండెంటుననీ బిరుదులిచ్చేసినా సగర్వంగా స్వీకరించాను.
అసలీ కాఫీ పైన ఇంత మక్కువ జీన్సు వల్లనే సంక్రమించిందని అనుకుంటూంటాను నేను. ఎందుకంటే, మా నాన్నగారికి కాఫీ పై మక్కువ నాకంటే ఒక రవ్వ ఎక్కువ. అందుకు ఋజువు ఎప్పుడూ ఆయన గదిలో మేకుకు వేళ్ళాడే కాఫీ ప్లాస్కే. మా అమ్మ పూజలో, పనిలో ఉన్నప్పుడు మాటిమాటికీ కాఫీ కలపమని అడిగితే విసుక్కుంటుందని ఒకేసారి ఫ్లాస్కులో పోయించేసుకుని ఆరారా సేవిస్తుంటారు మా నాన్నగారు. ఇకపోతే ఇంత చిన్నప్పుడే కాఫీ ఏంటని మా అమ్మ నా చేత కాఫీ మానిపించటానికి చేయని ప్రయత్నం లేదు. తన ప్రయత్నాలన్నీ విఫలమవ్వటంతో ఆఖరికి నా బలహీనతను నా బలం కోసం వాడుకునే ఉపాయం కనిపెట్టింది మా అమ్మ. చిన్నప్పుడు నేను కాస్త బలహీనంగా ఉండటం చేత డాక్టరు రాసిచ్చిన ప్రొటినెక్సు (పాలల్లో కలుపుకుని తాగే పొడి) నా చేత తాగించటానికి మా అమ్మ ఒక పావు కప్పు కాఫీ ని నాకు కొ/ఎసరు గా చూపించేది. దాని కోసం నేను కళ్ళూ, ముక్కూ మూసుకుని మూడు గుక్కల్లో మందు కంపు కొట్టే ఆ ప్రొటినెక్సు పాలని మింగేసి, తరువాత మా అమ్మ చేతి కమ్మని సువాసనలు వెదజల్లే నురగల కాఫీని ఆస్వాదించేదాన్ని.
ఇదిలా దావనలంలా వ్యాపించి నా స్నేహితులూ, సన్నిహితులూ నేను వాళ్ళింటికి వెళ్తున్నానంటే పాపం! వారికి కాఫీ అలవాటు లేకపోయినా కాఫీపొడి కొని ఉంచటం మొదలుపెట్టారు. మా చుట్టాలిళ్ళకి వెళ్ళినపుడు మా పెద్దమ్మ లు అందరినీ అడిగినట్లే నన్ను కూడా “కాఫీ తాగుతావుటే?” అని అడిగి అంతలోనే సర్దుకుని “దీనికి కాఫీ పిచ్చి కదూ!” అని లోపలికి వెళ్ళి అందరికీ ఇచ్చే కంటే మరికాస్త ఎక్కువ పోసి పెద్ద గ్లాసుతోనే సమర్పించుకునేవారు. కాఫీ అంటే ఎంత ఇష్టమున్నా ఏ కాఫీ పడితే ఆ కాఫీ తాగనండోయ్. కాఫీ అంటే నా నిఘంటువులో ఒకే ఒక అర్థం ఉంది. అది ఏ దేశానికి చెందినదైనా అచ్చమైన డికాక్షను కాఫీ మాత్రమేనని. బ్రూ కాఫీలూ, నెస్కెఫేలూ లాంటివి తాగి (అవంటే ఇష్టమున్న వారు మన్నించాలి) నా శరీరాన్ని, పవిత్రమైన కాఫీ పైనున్న నా ప్రేమనీ కల్మషం చేసుకోలేను.
దిష్టేమైనా తగిలిందో ఏమో గానీ, ఇంత ఇష్టమైన ఈ కాఫీ ని కావలసినన్ని సార్లు మనశ్శాంతిగా తాగుదామంటే ఎప్పుడూ కుదరదు. ఎందుకంటే నాకెప్పుడు ఒంట్లో బాగోక డాక్టరు దగ్గరకు వెళ్ళినా అదేంటో విచిత్రం గా, “మీరు కెఫీను తగ్గించాలండీ!” అంటాడు. (వాడి కన్ను కుట్టిందో ఏమో! వాడి ముందు కాఫీ గానీ తాగానా ఏవిటి కొంపతీసి?) ఆయనలా చెప్పీ చెప్పగానే నేను ముందుగా జాగ్రత్తపడతాను. కాఫీ మానేసేననుకునేరు. ఇంకా నయం, ముందు ఈ విషయం మా వారికి తెలీకుండా జాగ్రత్తపడతాను. తెలిసిందా ఇంక అంతే సంగతులు. కాఫీ ఒక్క పూటైనా మానేయమని సతాయింపులు, సాధింపులు. అవి పడలేక ఒక్కోసారి మానేసానని అబద్ధమాడి అనఫీషియల్ గా ఏ మధ్యాహ్నం వేళో తాగేస్తుంటాను.
అదేవిటోగానీ, కాఫీ మానమని నన్ను పోరిన వారే గానీ కాఫీ గొప్పతనాన్ని గుర్తించిన వారు లేరు. గొప్ప గొప్ప వాళ్ళంతా కాఫీ లు తాగి బుర్ర పదును చేసుకున్నవాళ్ళే కదా. ఆ మాట కొస్తే ఈ సోదంతా రాయటానికి నాకు ఓపికనిచ్చిన టానిక్ కూడా కాఫీనే. ఆఖరుగా ఒక మాట చెప్పాలి ఎంతమంది చెప్పినా ఒక్క పూట కూడా కాఫీ మానని నేను మా అమ్మ కి బాగోనపుడు మా అమ్మ కి నయమవ్వాలని బాబా కి మొక్కుకుని నెల రోజులు కాఫీ మానేసాను.
ఏది ఏమైనా నా బలమూ, బలహీనతా రెండూ కాఫీనే. సర్లెండి, బ్లాగు రాయటంలో పడి మర్చేపోయాను. కాఫీ వేళ మించిపోయింది. ఈ పూట ఇంకా కాఫీ తాగనే లేదు.