ఈ మధ్య శంకర్ దాదా జిందాబాద్ సినిమా విడుదలయ్యాక అన్ని వెబ్ సైట్ల లోను ఒకటే మాట. సినిమా ‘ఏ’ సెంటర్ల లోనే బాగా ఆడుతోందని, ‘బి’, ‘సి’ సెంటర్ల వాళ్ళకి గాంధీయిజం పట్టలేదని ఆన్ లైను పత్రికలన్నీ కోడై కూసాయి. ప్రతి చెత్త సినిమానీ పొగిడేసే పత్రికల వాళ్ళు ఈ సినిమానికి మాత్రం ‘3’ రేటింగు ఇవ్వటం ఇవన్నీ చదివి కొద్దిగా మనసు కలత చెంది ఇది రాస్తున్నాను. పత్రికల వాళ్ళ సంగతి వదిలేస్తే నా వరకు నాకు సినిమా బాగా నచ్చింది. ఈ మధ్యన ఇలాంటి మంచి సందేశాలు వున్న సినిమాలు కరువైపోయాయి. సరదాగా సాగిపోతూ అంతర్లీనంగా సందేశాన్ని నింపుకుని గాంధీ సిద్ధాంతాలని గాడ్సే కి కూడా అర్ధం అయ్యేలా అరిటిపండు వలిచి చెప్పినట్లుగా ఈ సినిమాలో చెప్తే ఇది ఎందుకనో మాస్ కి అర్ధం కాలేదట. ఇది పత్రికల వాళ్ళ భ్రమా లేక నిజంగానే మాస్ కి ఇది అర్ధం కాలేదా? మరి డబుల్ మీనింగ్ డైలాగులు చాలా సులువుగా అర్ధం చేసుకునే ఈ మాస్ అనబడే ప్రజానీకం రెండే రెండు మాటలైన సత్యం, అహింస అనే పదాలని అర్ధం చేసుకోలేకపోయారంటే ఇది నిజంగా సిగ్గు చేటు.
ఆనాడు గాంధీ గారి పిలుపుతో యెంతో మంది విద్యాధికులు వున్న వుద్యోగాలు, ఆస్థిపాస్థులు, అన్నీ వదిలేసి స్వాతంత్రం కోసం వెళ్తే, వేల మంది చదువు రాని ప్రజలు గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వాతంత్ర సమర బావుటా ఎగురవేయటానికి జైళ్ళకు కూడ వెళ్ళారు. వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు, మన భాషలో చెప్పాలంటే మాస్, క్లాస్ అందరూ వున్నారు. చదువు రాకపొయినా తాము వెర్రి గొర్రెలం కావని, వుద్యమాలతో బ్రిటీషు వారికి యుద్ధానికి ఆయుధాలు అఖ్ఖర్లేదని అహింస, సత్యగ్రహమే చాలని కొత్త అర్ధం చెప్పిన భారత ప్రజలు అదే గాంధియిజాన్ని మరో అరవయ్యేళ్ళ తర్వాత చెప్తే అర్ధం చెసుకోలేకపొయారా? రోజు రోజు కీ తెలివితేటలు పెంచుకుంటూ, ప్రపంచంతో పరుగెట్టే ఈనాటి ప్రజలకి సులువైన మహాత్ముని మాటలు చెవినపడలేదా లేక యానా గుప్తా వంపుసొంపులతో, పాటతో కళ్ళు, మనసూ రెండూ మూసుకుపోయాయా? అదే గనుక జరిగితే విశ్వకవి రవీంద్రుడన్నట్లు, “ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో ఆ స్వేఛ్ఛా స్వర్గానికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు” అని ప్రార్ధించటం తప్ప చేయగలిగేదేముంది?