వీకెండొస్తోందంటే చాలు శుక్రవారం నుంచే నేను ప్లాన్లు మొదలుపెడతాను. శుక్రవారం సాయంత్రాన్ని నాకెపుడూ వృధా చేయాలనిపించదు పైగా అది ఎంతో విలువైనది కూడానూ. ఎందుకంటే తరువాత వచ్చే శనివారం సాయంత్రమేమో ఇంకేముంది ఇంక వున్నది ఆదివారమొక్కరోజేగా అని బెంగ తో గడపాల్సివస్తుంది. ఆదివారం గురించి చెప్పనే అక్కర్లేదు మర్నాడొచ్చే సోమవారం నుంచీ పొలోమని తను ఆఫీసుకు నేను కాలేజీకు పోవాలి. అందుకే శుక్రవారం మాత్రం ఏ చీకూ, చింతా లేకుండా గడపాలని ఉంటుంది నాకు. అయితే అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే నాకీ బ్లాగు బ్లాగే అవసరమే రాకపోదును. సరిగ్గా శుక్రవారం నాడు మధ్యాన్నానికల్లా నా ప్లాన్ల జాబితా సిద్ధం చేసుకున్నాక మా వారికి ఫోన్ చేస్తాను కదా అదేంటో గానీ ఆయన మాట్లాడేలోపే అటువైపు నుంచి సమాధానం నాకు తెలిసిపోతుంది. అది నాకేదో ఇష్యూ వచ్చింది కాస్త ఆలస్యమవ్వచ్చని . ఆఫీసులో మొదలైన ఆ ఇష్యూ.. ఇష్యూ మా ఇంట్లో పెద్ద ఇష్యూ జరిగేదాక సా..గుతుంది. ఎందుకంటే నా ప్లాన్ల జాబితా అమలుకాబోదు కనుక. ఆ తర్వాత ఆలస్యంగా ఆయన ఇల్లు చేరాక ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేస్తానా..వద్దనుకుంటూనే మొదలుపెడతాను నా నిరసన. దానివల్ల మిగతా సమయం అంతా చీకూ, చింతా లేకుండా గడపటానికి బదులు చికాకులు, చింతలతో వెళ్ళబుచ్చుతాము. అంతటితో నా కలల శుక్రవారం కలతలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వలనేమో! నేను శుక్రవారం జాబితా తయారుచేసేలోపే మా వారి మేనేజరు అంతకంటే పెద్ద జాబితా తయారు చేస్తాడు. పోనిలే అనుకుంటే అదేదో మరో రోజు మరో రోజూ కాదాయె..సరిగ్గా శుక్రవారమే.
ఇదిలా ఉండగా మేముండేది కాలిఫోర్నియా కావటం వల్ల రాజమండ్రీలో కంటే ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయి. శుక్రవారం నాడు తను ఎంత ఆలస్యంగా వచ్చినా ఆ రోజు రాత్రి వేసే పదకొండింటి ఆటకు సినిమాకు వెళ్ళటానికి ఏ ఆటంకమూ రాదని అప్పటికప్పుడు మరో పధకం అమలుచేస్తాను. అందులోను తెలుగు సినిమాకి వాళ్ళ మేనేజరు ఖచ్చితంగా రాడని నా ధీమా. ముఖ్యంగా సాఫ్టువేరింజనీర్ల భార్యల ప్రధమ శత్రువైన లాప్ టాపు సినిమాకు రాలేదు. సరిగ్గా అక్కడే నా ప్లాన్లో చిన్న బగ్గు. దాని పేరు “క్రికెట్.” కాలిఫోర్నియాలో యెండలు మండినా, చలి వణికించినా ప్రతి శనివారం తను ఆరుగంటలకు లేచి వెళ్ళి మరీ ఆడే క్రికెట్ కోసం మా శుక్రవారం రాత్రి సినిమా వాయిదా పడుతుంది. ఒకవేళ తను సినిమాకి వెళ్దామన్నా రాత్రి రెండింటికి సినిమా అయ్యాక ఇంక మర్నాడు లేచి క్రికెట్ ఆడలేరని నేనే వద్దంటాను. అప్పుడుకూడా బాక్ గ్రౌండులో “నీకోసం ఒక్కరోజు క్రికెట్ కూడా నేను మానలేనా..?”లాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి కానీ అవి నా వూహల బాక్ గ్రౌండుకు మాత్రమే పరిమితమైపోతాయి. మరో ఇష్యూ మొదలుపెట్టే వోపిక లేక ఇంక ఒక నిర్ణయానికి వచ్చేస్తాను. “శుక్రవారం నాది కాదు!” అని. ఇంత జరిగినా షార్టు టెర్ము మెమొరీ వచ్చినట్లుగా మరుసటి శుక్రవారం మధ్యాన్నానికి నా ప్లాను సిద్ధం. అమలంటారా..? గ్రహాల అనుకూలత మీద ఆధారపడిఉంటుంది.
🙂
మీరు శనివారం ని మరీ తక్కువ గా తీసి పారేశారు. ఆలోచించండి.. శుక్రవారం రాత్రి వచ్చే సినిమా శనివారం రాత్రి కూడా ఆడుతుంది. శనివారం ఉదయం వుండే క్రికెట్ ఆదివారం ఉదయం వుండదు. అలాగే, శనివారం రాత్రి నుంచీ సోమవారం బెంగ ఎందుకు? దానికోసం ఆదివారం అంతా వుంది కదా? ఒక నైట్ మీది, ఒకటి వారిది అనుకుంటే తెలిపోతుందేమో!!.
bhale raasarandee. mee bhaadhani chaala andangaa present chesaaru.
రాధిక గారూ, మీ మందహాసం చూసాను. ఇంతకీ నా టపా మీకు నచ్చిందా? నా బ్లాగుకొచ్చినందుకు ధన్యవాదాలు.
శాంతిగారూ,
మీరన్నది నిజమేనండీ. శనివారం రాత్రి కూడా సినిమాకి వెళ్ళచ్చు. కానీ నేను ముందే చెప్పినట్లుగా శుక్రవారమంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం ఆ రోజు కాకుండా మరేరోజు సినిమాకి వెళ్ళినా అంత ప్రత్యేకంగా అనిపించదెందుకో. అలాగే ఆదివారమంతా ఇక్కడ కూరగాయలు వగైరా కొనటానికి వెళ్ళటంలోనే గడిచిపోతుంది. అమెరికాలో వీకెండు వచ్చినంతసేపు పట్టదు వెళ్ళటానికి. అందుకే నాకు ఆదివారమంటే బెంగ.
విద్యా,
మీ వ్యాఖ్యకు నా కృతజ్ఞతలు. మీ బ్లాగుకూడా ఇప్పుడే చూస్తున్నాను..బావుంది.
వసుంధర
హహహ… ఆయనకు కూడా సినిమా అలవాటు చెయ్యండి. ఆఫ్కోర్స్ క్రికెట్టు పిచ్చి లేని మగవాడు చాలా అరుదనుకోండి.
మీకీ తిప్పలు తప్పవల్లే ఉంది.
నాకంత వారాలపట్టింపుల్లేవు కానీ మీకథనం బావుంది. :))
మీ వర్ణన నాకు బాగా నచ్చింది కానీ ఇలాంటి సమస్యలూ ఉన్నాయని ఇప్పుడే వింటున్నా
నేటి ‘ఆర్ధిక ఆరాటాలు’ కి ‘కాలం పోరాటాలు’ తప్పవు.
వసుంధరగారూ ఈ టపా నచ్చకపోవడం కూడా వుంటుందా?ఆ నవ్వు సాడిస్ట్ నవ్వు.నాలాగా ఇంకొకరు బాధపడుతున్నారన్న ఆనందం.నాకు కూడా ఎందుకో శనివారం తో వారాంతం అయిపోతుందనే అనిపిస్తుంది.ఆదివారం మావారు మొత్తం నిద్రలోనే వుంటారు.నాకు కూరగాయలు తెచ్చుకోడానికి,లాండ్రీ వేసుకోడానికి,ఇల్లు క్లీనింగుకి సరిపోతుంది.శనివారాలు పార్టీలకి,ఇంటికి వచ్చే అతిధులకి వండి వడ్డించడానికి సరిపోతుంది. శుక్రవారమయితే కుటుంబం అంతా కలసి తిరుగుతూ ఎంజోయ్ చేస్తాము.మాకు ఇక్కడ అసలు భారతీయ సినిమాలు రావు కాబట్టి ఏ డీవీడీ నో తెచ్చుకుని రాత్రి 10 నుండి చూస్తూ కుర్చుంటాము.ఆ శుక్రవారానికి ఎవరయినా అడ్డం వస్తున్నారంటే నాకు వాళ్ల మీద చాలా కోపం వచ్చేస్తుంది.
శుక్రవారమే సినిమా చూడటం కుదరని పక్షంలో, ఆ రోజు మరో విధంగా ఆనందంగా గడిపేలా ప్రణాళిక వేసుకోవచ్చు. శుక్రవారం కొత్త సినిమా విడుదలయిన రోజయితే, ఇక్కడ, అసలే చిన్న థీయేటర్ తెర ముందు కూర్చోవాల్సుంటుంది. నిన్న మంగళ వారం కొత్త బంగారు లోకం చిత్రం IMC6 లో చూశాము. మేము ముగ్గురము ,ఇంకో భార్యా భర్తలు మాత్రమే ప్రేక్షకులు. ఇంటర్వల్ తరువాత ఆ couple మాయం. మేము ముగ్గురమే చిత్రాన్ని, హోం థీయేటర్ లో చూసినట్లుగా చూసి ఆనందించాము. పైగా మంగళవారం రెండు డాలర్ల తగ్గింపు ధరలతో టిక్కెట్లు పొందవచ్చు. శుక్రవారం సాయంత్రం సమయాన నాకు ఇంకా రెండు రోజులున్నాయి ఆనందించటానికని సంతోషంగా గడపండి. శనివారం సాయంత్రం, ఇంకా ఒక రోజు ఉన్నది , నా చేతిలో; స్వేచ్చగా, ఉల్లాసంగా గడపటానికి అనే positive thinking లో ఉండవచ్చు. Positive thinking ఆలొచన విధానం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
-cbrao
San Jose, CA.
రావు గారు, మీరు అన్నది నిజమే కానీ నేను మాత్రం కొంచం సరదా పద్ధతిలో ఈ బ్లాగు రాసాను. మరీ సీరియస్ గా కాదు. అయినా ఒక మాట మాత్రం నిజం నేను చాలా చిన్న విషయాలకి బాధపడుతుంటాను అలాగే చాలా చిన్న విషయాలకి సంబర పడిపోతాను. కొంచం balanced గా ఉంటే బావుంటుందని మా వారు ఎపుడూ అంటూ ఉంటారు. సరే కానీ మేము కూడా కొత్త బంగారు లోకం కి IMC 6 కే వెళ్ళాము. మేము Halloween రోజున వెళ్ళాము మాది కూడా అదే పరిస్థితి. జనమే లేరు. కానీ మధ్యలో లేచి వచ్చేయటానికి కూడా ధైర్యం కావాలనుకుంట. టిక్కెట్టు కొన్నాము కదా అని ఎలాగో అలా భరించాము సినిమాని. మా వారు “చెత్త బంగారు లోకం” అనే Title తో అపుడే ఒక బ్లాగు బ్లాగటానికి రూపకల్పన చేస్తున్నారు. సరేనండి మీ వ్యాఖ్యకు నా ధన్యవాదములు.
లచ్చిమి గారు! చాలా సంతోషమండీ! ఈ మధ్య బ్లాగు రాయలేదు. కానీ మీ అందరి వ్యాఖ్యలూ ఇంతకాలం తర్వాత కూడా అందుకుంటుంటే మళ్ళీ బ్లాగు రాయాలనిపిస్తోంది. త్వరలో రాస్తాను.
వసుంధర.
మీ చిరునామా, టెలిఫోన్ సంఖ్య ఇస్తూ నాకు (#cbraoin at gmail.com#) ఉత్తరం రాస్తారా? ఈ ఆదివారం సమావేశానికి మీరు రావాలని అభ్యర్ధన. వివరాలకు చూడండి
#http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_13.html